Nimmala Rama Naidu: అదే లక్ష్యంతో చంద్రబాబు, లోకేష్ ముందడుగు: మంత్రి లోకేష్
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:18 PM
ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ ఎంఈ పాలసీ, ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీలతో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
తిరుపతి, నవంబర్ 11: నాలుగు దశాబ్దాల సుధీర్ఘ అనుభవంతో చంద్రబాబు (CM Chandrababu) రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేయిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అంతర్జాతీయంగా సీబీఎన్ అంటే ఒక బ్రాండ్ అని.. ఆయన సీఎంగా ఉన్నారంటే పారిశ్రామికవేత్తలకు ఒక నమ్మకం, గౌరవమని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో 9.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో చంద్రబాబు, లోకేష్ పని చేస్తున్నారని వెల్లడించారు.
గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటే నేడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడిదారులను ఆకట్టుకుంటున్నామని తెలిపారు. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ ఎంఈ పాలసీ, ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీలతో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ, క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపై దృష్టిసారించిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయడంతో పాటు, ఈ మెగా సిటీలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా చేయనుందన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ , డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు.
పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రమ్మంటుంటే, రాష్ట్రంలో మళ్ళీ జగన్ రాడు అనే గ్యారంటీ ఇవ్వమంటున్నారని మంత్రి తెలిపారు. అమర్ రాజా బ్యాటరీస్, కియా అనుబంద సంస్దలు, జాకీ, ప్రాంక్టిన్ టెంపుల్టన్, లులూ, బిఆర్‌షెట్టి గ్రూప్, ట్రైటాన్ ఎలక్ట్రానిక్స్, వంటి పరిశ్రమలతో పాటు ఫార్చూన్ వంటి 500 కంపెనీలను కూడా జగన్ బలవంతంగా పక్క రాష్ట్రాలకు తరిమేశారని మండిపడ్డారు. మరలా జగన్ వస్తే రప్పా,రప్పా నరుకుతామని.. టెండర్లు రద్దు చేస్తామని.. విధ్వంసం చేస్తామంటూ పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
త్వరలోనే ఏపీకి మరిన్ని పరిశ్రమలు: మంత్రి పయ్యావుల
మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం
Read Latest AP News And Telugu News