Nadendla Manohar: మీరా రైతుల పక్షాన మాట్లాడేది.. వైసీపీపై నాదెండ్ల సీరియస్
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:03 PM
రైతులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది అబద్ధపు కథనాలు పత్రికలలో రాస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
విజయవాడ, నవంబర్ 27: రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని.. అయినా వైసీపీ నేతలు అన్యాయంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.1674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతలా రైతుల పక్షాన మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు 8 లక్షల 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. కృష్ణా జిల్లాలో లక్షా 7 వేల టన్నుల ధాన్యం సేకరించడం రికార్డ్ అని తెలిపారు. గోదావరి జిల్లాల నుంచి లక్ష టన్నుల పైనే ధాన్యం సేకరించామని చెప్పారు. అధికారులు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని.. వారి మనోధైర్యం దెబ్బ తీసేలా వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో 2022-23 ఖరీఫ్‌లో కేవలం 13వేల 560 మెట్రిక్ టన్నులు ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని.. 2023-24లో 16 వేల 978 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారని తెలిపారు. తాము మాత్రం లక్షా 7 వేల 960 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని చెప్పుకొచ్చారు. ఖరీఫ్, రబీలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో ట్రాన్స్ పోర్టు వాహనాల బకాయిలు నేడు రూ.9 కోట్లు చెల్లించామని మంత్రి చెప్పారు. 7 కోట్ల 53 లక్షల గోనె సంచులను ఏర్పాటు చేశామన్నారు. సీఎం సూచనలతో లక్ష సంచులు అదనంగా సిద్ధంగా ఉంచామని తెలిపారు.
మూడు నెలల్లో జరగాల్సిన ప్రక్రియ.. వాతవరణంలో వచ్చిన మార్పులతో ముందే ధాన్యం సేకరించామని చెప్పుకొచ్చారు. రైతుల ఆందోళనను గుర్తించి.. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందన్నారు. రైతులు కూడా అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనలు, ప్రోత్సాహం వల్లే అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కొంతమంది మాఫియాగా ఏర్పడి రైతులను ఇబ్బందులు పెట్టడానికి వారి స్వలాభం కోసం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తాము పూర్తి పారదర్శకత కోసం వాహనాలకు జీపీయస్ ఏర్పాటు చేస్తే.. దళారులు రైతులను మాయ మాటలతో మోసం చేస్తున్నారన్నారు.
75 కిలోల బస్తాకు 1792 రూపాయల మద్దతు ధర తాము ఇస్తామని ప్రకటిచాంరు. 30 వ తేదీ వరకు ఏపీలో వర్షాలు లేవని.. ఆ తర్వాత ఐదు జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నాయన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఒకటో తేదీ నుంచి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దళారులు చేసే మోసాలు నమ్మవద్దని.. వారిని తరిమికొట్టాలని రైతులను కోరారు. 24 వేల ట్రక్స్.. ధాన్యం తరలింపుకు జీపీయస్‌తో సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్షాల నుంచి కౌలు రైతులను ఆదుకునేందుకు టార్‌ఫాల్స్‌ను కూడా పూర్తిగా సిద్ధంగా ఉంచామని చెప్పారు. అబద్ధాలు నమ్మి.. తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. సివిల్ సప్లయిస్ శాఖ రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మరోసారి పర్యటించి రైతులకు భరోసా ఇస్తామని మంత్రి తెలిపారు.
రైతులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది అబద్ధపు కథనాలు పత్రికలలో రాస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రాప్ నమోదు మేరకు ఆ పొలంలో వచ్చే దిగుబడిని పూర్తిగా కొనేందుకు తాము రెడీ ఉన్నట్లు వెల్లడించారు. ఫైన్ క్వాలిటీ రైస్‌కు ప్రాధాన్యత ఇచ్చి.. మధ్యాహ్న భోజన పథకానికి వాడుతున్నామన్నారు. ఆ పంట ఎక్కడ ఉన్నా.. ప్రతి బస్తా కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పామన్నారు. రాజకీయంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారికి రైతులే బుద్ధి చెప్పాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఫోకస్
రాజధానిలో వెంకన్న ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ
Read Latest AP News And Telugu News