Ditwah Cyclone: మళ్లీ తుఫాన్.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:22 PM
ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులు వీడడం లేదు. మొన్న మొంథా.. నిన్న సెన్యార్.. నేడు దిత్వా తుఫాన్ ముంచుకొస్తుంది. ఈ తుఫాన్ కారణంగా.. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
విశాఖపట్నం, నవంబర్ 27: శ్రీలంకను అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది. ఈ మేరకు విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఉన్నతాధికారి జగన్నాథ కుమార్ వెల్లడించారు. ఈ తుఫాన్‌కు దిత్వాగా అని యమెన్ పేరు పెట్టిందని తెలిపారు. ఈ తుఫాన్ కారణంగా రానున్న వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు.. మరికొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కాబట్టి సముద్రంలో వేటకు వెళ్ళ వద్దని మత్స్యకారులను హెచ్చరించారు. తీరం వెంబడి ఉన్న పోర్టులో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశామని జగన్నాథ కుమార్ వివరించారు.
ఇక దిత్వా తుఫాన్ కారణంగా.. శనివారం నుంచి సోమవారం వరకు అంటే.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయిన అంచనా వేస్తున్నారు. 29వ తేదీన అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక 30వ తేదీన నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో పూర్తిగా భిన్న పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. కానీ గత నాలుగు రోజులుగా ఈ తీవ్రత తగ్గింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట
Read Latest AP News And Telugu News