Ditwah Cyclone: కొనసాగుతున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్.!
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:20 AM
బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారయణలు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.
అమరావతి, నవంబర్ 30: నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది(Ditwah Cyclone). ప్రస్తుతం ఇది కారైకాల్(Karaikal)కు 80 కి.మీ., పుదుచ్చేరి(Puducherry)కి 160 కి.మీ., చెన్నై(Chennai)కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(SDMF) పేర్కొంది. గడచిన 6 గంటల్లో సుమారు 5 కి.మీ వేగంతో ఈ తుఫాను కదిలినట్టు తెలిపింది. మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశముందంది. దీంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను ప్రభావంతో.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేశారు.
దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు(Nellore) జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో సముద్రంలో అలల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు ఇప్పటికే నిండుకుండల్లా మారగా.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదం పొంచిఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరినార్లు నీటమునిగాయి. వరుసగా మూడు తుఫాన్లు సంభవించడంతో మూడు నెలలుగా అక్కడ చేపలవేట స్తంభించింది. ఫలితంగా మత్స్యకారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణపట్నం పోర్టులో ఇప్పటికే మూడో నంబర్ ప్రమాద సూచికలు జారీ అయ్యాయి. దీంతో కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్లకు చేరుకున్నాయి మరబోట్లు.
మంత్రుల సమీక్ష..
భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy), నారాయణ(Narayana) నెల్లూరుకు చేరుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై.. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి: