Share News

YSRCP Jagan Mohan Reddy: తొక్కి చంపింది జగన్‌ కారే

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:28 AM

పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపింది కాన్వాయ్‌లోని జగన్‌ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీ కొట్టిన సందర్భంలో సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో వైరల్‌గా మారింది.

 YSRCP Jagan Mohan Reddy: తొక్కి చంపింది జగన్‌ కారే

సింగయ్య మృతి ఘటనపై వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినలే

మార్ఫింగ్‌ చేసిన ఆధారాలు లేవు.. ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టీకరణ!

  • దీంతో జగన్‌ను ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకుల నోళ్లకు తాళం

  • ‘బాబు కల్పిత మరణ దృశ్య’మన్న రోత పత్రిక రాతలకు చెక్‌

  • 1న జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

  • అదే రోజున కోర్టుకు ఫోరెన్సిక్‌ నివేదిక సమర్పణ

  • జగన్‌ కారుకు ఇప్పటికే ఫిట్‌ నెస్‌ పరీక్షలు పూర్తి

గుంటూరు, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపింది కాన్వాయ్‌లోని జగన్‌ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీ కొట్టిన సందర్భంలో సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోను మార్ఫింగ్‌ చేశారంటూ నోరు పారేసుకున్న వైసీపీ నేతల నోళ్లకు ఫోరెన్సిక్‌ నివేదిక తాళం వేసింది. సింగయ్యను ఢీ కొట్టింది జగన్‌ ప్రయాణిస్తున్న కారేనని ఆ నివేదిక స్పష్టంచేసినట్లు తెలిసింది. జగన్‌ కారు కుడివైపు ముందు చక్రం కింద సింగయ్య నలుగుతున్న సమయంలో జగన్‌ ఎడమవైపు నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తుండటం, ఓ కార్యకర్త బానెట్‌పై నిలబడి చిందులు వేస్తుండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది.


అయితే ఆ వీడియో ఒరిజినల్‌ కాదంటూ ప్రజలను, కేసును తప్పుదారి పట్టించేలా మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు గొంతు చించుకున్నారు. అది ‘బాబు కల్పిత మరణ దృశ్య’మంటూ జగన్‌ సొంత పత్రికలో రోత రాతలు రాశారు. ముందుగా ఎస్పీ.. కారు నంబర్‌తో సహా ప్రకటించారని, ఆ తర్వాత మార్ఫింగ్‌ వీడియోను ప్రభుత్వం సృష్టించి జగన్‌ను కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అంతేగాక సింగయ్య మృతి చెందిన విషయమే తనకు తెలియదని, సింగయ్య మృ తితో తనకు ఎటువంటి సంబంధం లేదని, అందువల్ల కేసును కొట్టివేయాలంటూ జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జూలై 1న కోర్టులో ఈపిటిషన్‌పై విచారణ జరగనుంది. అదే రోజున ఫోరెన్సిక్‌ నివేదికను కోర్టుకు పోలీసులు సమర్పించనున్నారు.


ఆధారాలతో సిద్ధమైన పోలీసులు

పోలీస్‌ శాఖ ఈ కేసులో తొలినుంచీ పగడ్బందీగా విచారణ జరుపుతోంది. కారు ఢీ కొట్టిన వీడియోను, పోలీసులు డ్రోన్‌ కెమెరా ద్వారా తీసిన వీడియో ఫుటేజీలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఆ వీడియో చిత్రీకరించిన సెల్‌ఫోన్‌ ఐడీ, ఫోన్‌ ఉన్న లొకేషన్‌ సహా గుర్తించి అది ఒరిజినల్‌దేనని ఫోరెన్సిక్‌ అధికారులు నివేదిక ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే పోలీసులు జగన్‌ కారుకు ఫిట్‌నెస్‌ పరీక్షలు జరిపించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న దాదాపు పదిమంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. కాగా, కారు డ్రైవర్‌ రమణారెడ్డితో పాటు జగన్‌, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని తదితరులను నిందితులుగా పేర్కొంటూ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నిందితులు తమను కేసు నుంచి తొలగించాలంటూ పిటిషన్లు వేశారు. దీనిపై ఈ నెల 27న కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్‌ కోర్టుకు ప్రాథమిక నివేదిక సమర్పించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, ఇతర అన్ని సాంకేతికపరమైన ఆధారాలను సమర్పించేందుకు గడువు కోరగా, మంగళవారం నాటికి వాటిని సమర్పించాలని కోర్టు కోరింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును పగడ్బందీగా విచారించి ఆధారాలతో సహా నివేదికను సిద్థం చేశారు. కాగా,ప్రధాన నిందితుడు ఏఆర్‌ కానిేస్టబుల్‌, జగన్‌ కారు డ్రైవర్‌ రమణారెడ్డి విచారణకు సహకరించలేదని తెలిసింది.


ప్ర మాదం జరిగిన సమయంలో బ్యానెట్‌పై ఓ కార్యకర్త ఉండడంతో చక్రం కింద వ్యక్తి పడిన విషయం తనకు కనిపించలేదని, కనీసం ఆ విషయం కూడా తనకు తెలియదని పోలీసుల వద్ద డ్రైవర్‌ వాదించినట్టు తెలిసింది. సింగయ్య కారు చక్రం కింద నలుగుతున్న సందర్భంలో స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడం, ఆ తర్వాత కారు వెనక్కు నడపడం, వారు సింగయ్యను పక్కకులాగడం వంటి దృశ్యాలు ఉన్న వీడియోను చూపినా, ఆయన జవాబులో మార్పులేదని తెలిసింది. ప్రమాద ఘటనపై కారులో ఎలాంటి చర్చ జరగలేదని డ్రైవర్‌ చెప్పటం పోలీసులను విస్మయానికి గురిచేసినట్టు తెలిసింది.

ఆ పోలీసులపై విచారణ ముమ్మరం

సింగయ్య మృతికి జగన్‌ కాన్వాయ్‌లోని ప్రైవేటు వాహనం కారణం అనేలా కేసును తప్పు దారి పట్టించి క్లోజ్‌ చేేసందుకు ప్రయత్నించినట్టు గుర్తించిన కొందరు పోలీసులపై విచారణ ముమ్మరమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పోలీస్‌ శాఖలో వైసీపీ కోవర్ట్‌లుగా కొనసాగుతున్నవారు ఎవరనేది నిగ్గు తెల్చే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ క్రమంలో అనుమానితులైన పోలీస్‌ అధికారుల ప్రభుత్వ, వ్యక్తిగత నెంబర్లతో పాటు వైసీపీకి చెందిన సుమారు పదిమంది నాయకుల సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాపై అధికారులు దృష్టి సారించారు. ఎవరు ఎవరితో మాట్లాడారనేదానితో పాటు వాట్సాప్‌ కాల్స్‌ ఎవరెవరి మధ్య నడిచాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 03:28 AM