Share News

YS Sharmila: స్వార్థ రాజకీయాల్లో జగన్‌ నెంబర్‌ వన్‌

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:29 AM

స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్‌మోహన్‌రెడ్డి నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

 YS Sharmila: స్వార్థ రాజకీయాల్లో జగన్‌ నెంబర్‌ వన్‌

  • మోదీ హయాంలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: షర్మిల

కాకినాడ, అమలాపురం టౌన్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్‌మోహన్‌రెడ్డి నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మహా సముద్రంలాంటి కాంగ్రె్‌సలో పిల్ల కాలువల్లాంటి పార్టీలన్నీ కలవాల్సిందేనన్నారు. కాకినాడ జిల్లాలో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి శనివారం ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా కాకినాడలోనూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోనూ ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కావడం రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో అవసరమని షర్మిల చెప్పారు. అధికార టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైసీపీ ఇలా అన్ని పార్టీల వారు బీజేపీకి తొత్తులుగా మారి పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. మోదీకి అంత గులాంగిరీ చేయాల్సిన అవసరం ఈ పార్టీలకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.


రాజశేఖర్‌రెడ్డి బీజేపీని వ్యతిరేకించారని తెలిసి కూడా అదే మోదీకి జగన్‌ దత్తపుత్రుడిగా మారారన్నారు. బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్‌ పూర్తిగా స్వార్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకుని, ఎక్కడపడితే అక్కడ మద్దతు, ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చారని, అదానీ, అంబానీలకు ఎంతో దోచి పెట్టారని ధ్వజమెత్తారు. బీజేపీతో కొట్లాడే చిత్తశుద్ధి వైసీపీకి లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రానున్న నాలుగేళ్లలో బలోపేతమవుతుందని, పిల్లకాలువలన్నీ కాంగ్రెస్‌ పార్టీలో కలవాల్సిందేనని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడి, మోదీని, బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రె్‌సని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. మోదీ హయాంలో దేశంలో గత పదకొండేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, వైసీపీ పార్టీలకు కూడా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదన్నారు.


చివరకు మీడియాకు కూడా దమ్ము లేకుండా చేశారన్నారు. పలు పర్యాయాలు మోదీ కేడీ అంటూ వ్యాఖ్యానించారు. గోద్రా రైలు సంఘటన నుంచే మోదీ అంటే ఏమిటో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. రాహుల్‌గాంధీ క్రేజ్‌ అంతకంతకు పెరుగుతుండడంతో బీజేపీ ప్రభుత్వం తట్టుకోలేక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తెరపైకి తీసుకువచ్చిందన్నారు. అంతకంటే దారుణమైన పరిస్థితులు గత 11 ఏళ్లుగా దేశంలో ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి న్యాయం చేయగల శక్తి కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు తగ్గించినా ఒక్క ఎంపీ కూడా నోరు మెదపకపోవడం దారుణమన్నారు. నాటి సీఎంలు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి హయాంలో తన ఫోన్‌ను సైతం టాపింగ్‌ చేశారన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వాస్తవాలను బయట పెడుతున్న మీడియాపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 07:03 AM