YCP Jagan Mohan Reddy: కారు కింద సింగయ్య పడ్డారని జగన్‌కు తెలుసు
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:00 AM
వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య తాము ప్రయాణించే వాహనం కింద పడ్డారని తెలిసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు ర్యాలీని ముందుకు కొనసాగించారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.

కనీసం అంబులెన్స్‌ను కూడా పిలవలేదు
పోలీసులకూ సమాచారం ఇవ్వలేదు
రోడ్డుపక్కన వదిలేసి వెళ్లిపోయారు
ఈ ఘటనను కప్పిపుచ్చడానికి
తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు
3 వాహనాలు, 100 మందితో వెళ్లేందుకే జగన్‌కు అనుమతి
కానీ వేల మందిని సమీకరించారు
వందల వాహనాలతో ర్యాలీ చేశారు
ఘటనపై ప్రాథమిక ఆధారాలున్నాయి
హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి నివేదన
ఫొటోలు, ఇతర ఆధారాల సమర్పణకు టైమివ్వాలని వినతి
వాహనంలో ఉన్న పిటిషనర్ల పాత్ర ఏముంటుంది?
అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా ప్రమాదాలు జరుగుతుంటాయిగా
ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి
1 వరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలొద్దని పోలీసులకు ఆదేశం
కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా ప్రమాదాలు జరుగుతుంటాయి. కుంభమేళాలో కూడా ఘటనలు జరిగాయి కదా! ప్రమాద ఘటనలో వాహనంలో ఉన్న పిటిషనర్ల పాత్ర ఏముంటుంది? కారు కింద పడిన వ్యక్తిని అలా చావనివ్వండని ముందుకెళ్తారా? అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్నవారికి ఉంటుందా?
- జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి
అనుకోకుండా ప్రమాదం జరిగితే వాహనం నడిపిన డ్రైవర్‌ను అందుకు బాధ్యుడిని చేయొచ్చు. కానీ ప్రస్తుత కేసు అలాంటిది కాదు. ప్రమాద ఘటననే కాకుండా.. దానికి దారితీసిన అన్ని అంశాలనూ కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణిస్తునవారిని కూడా ప్రాసిక్యూట్ చేసిన సందర్భాలున్నాయి.
- హైకోర్టులో ఏజీ వాదన
అమరావతి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య తాము ప్రయాణించే వాహనం కింద పడ్డారని తెలిసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు ర్యాలీని ముందుకు కొనసాగించారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. కనీసం అంబులెన్స్‌ను కూడా పిలవలేదని.. పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఎలాంటి ఉపశమన చర్యలూ తీసుకోకుండా సింగయ్యను రోడ్డు పక్కన వదిలేశారన్నారు. ఈ అంశాలను పరిశీలిస్తే డ్రైవర్ దూకుడుగా, నిర్లక్ష్యంగా ముందుకెళ్లేందుకు కారులో ఉన్న పిటిషనర్లు సహకరించారని అర్థమవుతోందని తెలిపారు. ‘వారు ప్రేరేపించడం, ప్రోత్సహించడం వల్లే డ్రైవర్ ఇలా వ్యవహరించారా అనేది దర్యాప్తులో తేలాల్సిన అంశం. కాన్వాయ్‌లోని మరొక వాహనం ఢీకొని సింగయ్య మరణించినట్లు మొదటిరోజు చిత్రీకరించారు. ఘటన జరిగిన తర్వాత దానిని కప్పిపుచ్చేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. అందుకు తగిన ఆధారాలున్నాయి. ఘటన జరిగిన రోజు ఎస్పీ ఒక ప్రకటన చేశారని.. ఆ తర్వాత దర్యాప్తులో తేలిన వివరాలన్నీ అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేశారని పిటిషనర్లు వాదించడం సరికాదు.
ఘటనకు తమను బాధ్యులను చేయడానికి వీల్లేదని, వాహనం నడిపిన డ్రైవర్‌దే బాధ్యతని తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. వాహన ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణిస్తునవారిని కూడా ప్రాసిక్యూట్ చేసిన సందర్భాలున్నాయి. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యం, కారులోని ఇతరుల పాత్రపై విచారణ కొనసాతుంది’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని.. కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. ‘కుంభమేళాలో కూడా ఘటనలు జరిగాయి కదా! ప్రమాద ఘటనలో వాహనంలో ఉన్న పిటిషనర్ల పాత్ర ఏముంటుంది? కారు కింద పడిన వ్యక్తిని అలా చావనివ్వండని ముందుకెళ్తారా? అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్నవారికి ఉంటుందా’ అని ప్రశ్నించారు. కారు కింద వ్యక్తి పడ్డారని వారికి తెలుసని, ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఏజీ బదులిచ్చారు. ‘రెంటపాళ్ల పర్యటనకు జగన్మోహన్‌రెడ్డి పోలీసుల అనుమతి కోరారు. మూడు వాహనాలు, 100 మందితో వెళ్లేందుకు మాత్రమే పోలీసులు అనుమతించారు. వాని సూచనలను పక్కనపెట్టి వేల మందిని సమీకరించారు. వందలాది వాహనాలతో కాన్వాయ్‌గా వెళ్లారు’ అని తెలిపారు. వ్యాజ్యాలు గురువారం మరో న్యాయమూర్తి ముందు విచారణకు వచ్చినప్పుడు వివరాలు సమర్పించేందుకు మంగళవారం వరకు సమయం కోరానని.. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకునే అవకాశం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేసిన నేపఽథ్యంలో విచారణ శుక్రవారానికి వాయిదా పడిందని ఏజీ వెల్లడించారు.
ఈ అంశం వరకే కట్టుబడి వారు వాదనలు వినిపిస్తే తనకు అభ్యంతరం లేదన్నారు. కేసు మెరిట్స్ ఆధారంగా వాదనలు వినిపించేందుకు సమయం కోరారు. ర్యాలీలో మొత్తం మూడు మరణాలు చోటు చేసుకున్నాయని, వాటన్నిటికీ పిటిషనర్లను బాధ్యులను చేయలేదని గుర్తుచేశారు. ఈ నెల 22న వారిని నిందితులుగా చేర్చామని తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ సమయంలో కేసు లోతుల్లోకి వెళ్లి విచారించే పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. పిటిషనర్లు కేసును కొట్టివేయాలని కోరుతున్న నేపథ్యంలో ఘటనకు సంబంధించిన ఫొటోలు, ఇతర ఆధారాలన్నింటినీ కోర్టు ముందు ఉంచుతామన్నారు. మంగళవారం వరకు సమయమివ్వాలని కోరారు.
డ్రైవర్‌నే బాధ్యుడిని చేయాలి..!
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సి.రఘు, న్యాయవాదులు వై.నాగిరెడ్డి, దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన రోజు ఎస్పీ పత్రికా సమావేశంలో ‘ఏపీ 26సీఈ 0001’ నంబరు వాహనం ఢీకొని వ్యక్తి మరణించారని ప్రకటన చేశారన్నారు. కొన్ని రోజులు గడిచాక జగన్ వాహనం ఢీకొని మరణించినట్లు చెబుతున్నారని తెలిపారు. ‘వాహనంలో ప్రయాణిస్తున్నవారిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. వాహన ప్రమాదానికి డ్రైవర్‌ను బాధ్యుడిని చేయాలి తప్ప వాహనంలో ప్రయాణిస్తున్నవారిని నిందితులుగా చేర్చడానికి వీల్లేదు. జగన్ వద్దకు వస్తున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదు. దీనిపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు వేశాం. రెండో తేదీ వరకు కేసు ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల(స్టే) చేయండి’ అని కోరారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి.. మంగళవారం వరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు.