Notice To Sajjala Bhargav: సజ్జలకు నోటీసులు.. ఏ కేసులో అంటే
ABN , Publish Date - May 28 , 2025 | 10:37 AM
Notice To Sajjala Bhargav: పవన్, లోకేష్‌లపై అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

గుంటూరు, మే 28: వైసీపీ నేత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డికి (YSRCP Leader Sajjala Bhargav Reddy) మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌పై (Minister Nara lokesh) అనుచిత పోస్టుల కేసులో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. పవన్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదు అయ్యింది.
అయితే ఈ నోటీసులపై సజ్జల ఏ విధంగా స్పందిస్తారు.. అసలు పోలీసుల విచారణకు హాజరు అవుతారా లేరా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పలు మార్లు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు పలువురు నేతలను విచారణకు రమ్మని పిలిచినప్పటికీ వాయిదా వేస్తూ వచ్చారు. అంతే కాకుండా కోర్టుకు వెళ్లి లాయర్లను పంపించిన ఘటనలు ఉన్నాయి. మరి ఈరోజు సజ్జల పోలీసుల విచారణకు వస్తారా రారా అనేది వేచి చూడాలి.
కాగా.. గతంలో పులివెందుల పోలీస్‌స్టేషన్‌లోనూ సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కేసు నమోదు అవగా.. సజ్జలతో పాటు, అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమంలో అసభ్యకర పోస్టులకు సంబంధించి గత ఏడాది నవంబర్‌లో పోలీసులు పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా వర్రా రవీందర్ రెడ్డి, ఏ2గా సజ్జల భార్గవ్ రెడ్డి, ఏ3గా అర్జున్ రెడ్డిపై కేసులు నమెదు అయ్యాయి. అలాగే కేసుకు సంబంధించి పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అన్ని కేసుల్లో ఇటీవల వర్రా రవీందర్ రెడ్డికి బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
ఇవి కూడా చదవండి
NTR Jayanti: ఎన్టీఆర్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
తాగి టేబుల్ మీద డ్యాన్స్ చేయమన్నారు.. శాసనసభ్యురాలికీ లైంగిక వేధింపులు
Read Latest AP News And Telugu News