CJI BR Gavai: ఏపీ ప్రభుత్వ ప్రజాహిత చర్యలు అభినందనీయం: సీజేఐ గవాయ్
ABN , Publish Date - Nov 16 , 2025 | 02:10 PM
పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడేలా కోర్టులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సూచించారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.
అమరావతి, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగానిది 75 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (CJI BR Gavai) వ్యాఖ్యానించారు. రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడే అవకాశం తనకు రావడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి అని తెలిపారు. తన న్యాయవాద ప్రస్థానం అమరావతిలో ప్రారంభమైందని ఉద్ఘాటించారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ(ఆదివారం) ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సీకే కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. 'ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్' అనే అంశంపై ప్రసంగించారు జస్టిస్ గవాయ్.
అమరావతికి రావడం నాకు సంతోషంగా ఉంది..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తనను నియమించిన తర్వాత తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతికి వచ్చానని చెప్పుకొచ్చారు. అమరావతికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమరావతికి గొప్ప చారిత్రాత్మక గుర్తింపు ఉందన్నారు. మహారాష్ట్రలోని అమరావతిని ఇంద్రపురిగా పిలుస్తారని.. ఏపీలోని అమరావతి సైతం ఇంద్రుడు తిరిగిన నేలగా ప్రసిద్ది చెందిందని పేర్కొన్నారు. సీజేఐగా తన చివరి కార్యక్రమం కూడా అమరావతిలో జరుగుతోందని వివరించారు. భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగం రక్షణ కల్పించిందన్నారు సీజేఐ.
పౌరుల హక్కులు కాపాడేలా రక్షణ కల్పించాలి..
పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడేలా కోర్టులు రక్షణ కల్పించాలని సీజేఐ సూచించారు. రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. సామాజిక, ఆర్థిక సమానత్వం సాధనే లక్ష్యంగా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని వివరించారు. పౌరులందరూ సమానంగా ఎదిగేలా అవకాశాలను రాజ్యాంగం కల్పించిందన్నారు. మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా మహిళలకు సమాన అవకాశాలు రాజ్యాంగంలో కల్పించారని పేర్కొన్నారు జస్టిస్ బీఆర్ గవాయ్.
ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీం తీర్పు..
‘రాజ్యాంగం గత 75 ఏళ్లలో అనేక రంగాల్లో రిజర్వేషన్లను వర్తింపజేసింది. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లోనూ చట్టం చేశారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు విద్య ఎంతో ముఖ్యమని అంబేడ్కర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలనేది నా అభిప్రాయం. జ్యోతి రావ్ ఫూలేను అంబేడ్కర్ గురువుగా భావించేవారు. మహిళలపై అసమానత రూపుమాపేందుకు జ్యోతి రావ్ ఫూలే ఎంతో కృషి చేశారు. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మహిళలకు సమానత్వం ఉండాలనేది సుప్రీంకోర్టు విధానం. న్యాయ రంగంలో మహిళలు చాలా బాగా రాణిస్తున్నారు’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
హక్కులపై అవగాహన కల్పించాలి..
‘రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం కల్పించిన అవకాశాలతో అనేక మంది అత్యున్నత స్థాయికి చేరారు. గిరిజన సామాజిక వర్గం నుంచి తొలి మహిళ రాష్ట్రపతి అయ్యారు. ఓ ఛాయ్ వాలా సైతం దేశ ప్రధాని అయ్యారు. ఎస్సీ వర్గాల నుంచి వచ్చిన బాలయోగి, మీరా కుమారి లోక్‌సభ స్పీకర్లు అయ్యారు. దేశంలో ఎంతోమంది ఎస్సీ వర్గం నుంచి సీఎస్‌లు, డీజీపీలు అయ్యారు. ప్రజలను హెల్తీ, వెల్దీగా ఉంచడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయం’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత
Read Latest AP News And Telugu News