Minister Nara Lokesh: గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ
ABN , Publish Date - Dec 11 , 2025 | 07:24 AM
కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారాలోకేశ్ సూచించారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ సమావేశం అయ్యారు.
అమరావతి/టోరెంటో, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి):కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) సూచించారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో(Business Council of Canada BCC) మంత్రి లోకేశ్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళ్తొందని తెలిపారు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించాలని కోరారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో గత 18నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. 1053 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం, సువిశాలమైన రోడ్లు, రైలు మార్గాలు, ఆరు ఆపరేషన్ పోర్టులు, ఆరు ఎయిర్ పోర్టులతో విస్తృతమైన కనెక్టివిటీ కలిగి ఉందని తెలిపారు. మరో ఆరునెలల్లో భోగాపురం ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్టుతోపాటు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి గ్లోబల్ సంస్థలు ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు.
టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో విశాఖపట్నం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడులకు కెనడియన్ పెట్టుబడిదారులను ప్రోత్సహించాల్సిందిగా మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
ఏపీకి సహకారం అందిస్తాం: గోల్డీ హైదర్
ఒట్టావాలో పనిచేస్తున్న తమ సంస్థ కెనడాలోని పారిశ్రామిక సంస్థల సీఈవోలు, వ్యాపారవేత్తలతో దేశ ఆర్థికవ్యవస్థ, పోటీతత్వం, గ్లోబల్ స్థాయి ప్రతిష్ఠను బలోపేతం చేయడానికి కృషిచేస్తోందని బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్ తెలిపారు. ఇంధనం, ఆర్థిక, సాంకేతికత, తయారీ వంటి విభిన్న రంగాల నుంచి 150కు పైగా సంస్థల ప్రతినిధులు బీసీసీలో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు.
ఈ సంస్థలన్నీ కలిపి 1.7 మిలియన్ కెనడియన్లకు ఉపాధి కల్పించడమేగాక దేశ జీడీపీలో గణనీయమైన వాటా కలిగి ఉందని చెప్పుకొచ్చారు. కృత్రిమ మేథస్సు (AI) వినియోగం, సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ ఆధారిత ఉత్పాదకతలను ప్రోత్సాహిస్తున్నామని వివరించారు. క్లీన్ టెక్నాలజీ, కార్బన్ ప్రైసింగ్ ఫ్రేమ్ వర్క్, సుస్థిర వనరుల అభివృద్ధికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కెనడియన్ సంస్థల పెట్టుబడులకు తమవంతు సహకారం అందిస్తామని గోల్డి హైదర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ
Read Latest AP News And Telugu News