Minister Mandipalli: ఆ హామీని నెరవేరుస్తాం.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ABN , Publish Date - Jan 27 , 2025 | 09:36 PM
Minister Mandipalli Ramprasad: వైసీపీపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో యువనేత లోకేష్ రికార్డు సృష్టించారని అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. యువగలం పాదయాత్రతో రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని యువనేత లోకేష్ మార్చేశారని చెప్పారు. యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించడంతో అప్పటి ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైందన్నారు. యువగళం పాదయాత్ర మొదలై రేపటికి రెండేళ్లు పూర్తి చేసుకుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయడం జరుగుతుందని చెప్పారు.
రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు,232 మండలాలు మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర చేశారని అన్నారు. పాదయాత్రలో నారా లోకేష్ ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం నుంచి నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారని విమర్శించారు. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో యువనేత లోకేష్ రికార్డు సృష్టించారని అన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
గుంతలు లేని రోడ్లు లక్ష్యంగా పని చేస్తున్నాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ఏలూరు జిల్లా: రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు లక్ష్యంగా పని చేస్తున్నామని ఏపీ రోడ్డు రహదారులు, భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు . దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పెరికీడు వంతెన వద్ద చింతమనేని ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. పెరికీడు పెదపాడు రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతామనేని ప్రభాకర్‌తో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపరిశీలించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... 53 వేల కిలోమిటర్ల NDB రోడ్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. 65శాతం పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. 2014-2019 మధ్యలో మాత్రమే రహదారుల నిర్మాణం జరిగాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.7334 కోట్లు మాత్రమే పనులు జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో రూ. 1061కోట్ల మరమ్మతుల పనులు చేపట్టామని బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం రహదారి నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు 12,200 కిలోమిటర్లు పూర్తి చేశామని తెలిపారు. జంగిల్ క్లియరెన్స్ కూడా చేసి పనులు చేస్తున్నామన్నారు. గతంలో మన రోడ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పరిశీలించి వాళ్ల రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేసే వారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయంలో మన రోడ్లపై పక్క రాష్టాల నాయకులు జోకులు కూడా వేశారని చెప్పారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రూ.3014 కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. ఒక్క ఏలూరు జిల్లాకే రూ. 94 కోట్లు కేటాయించామని తెలిపారు. NDB రోడ్లు పనులను వచ్చేనెల చివరి నాటికి పూర్తి చేస్తామని అన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.