Chandrababu Naidu and Nara Lokesh: బిహార్‌కు సీఎం చంద్రబాబు, లోకేశ్.. ఎప్పుడంటే..?
ABN , Publish Date - Nov 18 , 2025 | 03:36 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ బిహార్ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి బిహార్ చేరుకోనున్నారు.
అమరావతి, నవంబర్ 18: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం ఖరారు అయింది. సీఎం నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లకు ఆహ్వానం అందింది. నవంబర్ 20వ తేదీన వీరు బిహార్ వెళ్లనున్నారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగే సీఎం నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన వివరాలను బిహార్‌లోని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా వివరించారు.
243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీకి రెండు విడతలుగా.. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలను నవంబర్ 14వ తేదీన లెక్కించారు. ఈ ఎన్నికల్లో బిహార్ ఓటరు ఎన్డీయేకు వరుసగా మరోసారి పట్టం కట్టాడు. జేడీ (యూ) అధినేత నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకోసం రాజధాని పాట్నాలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ సీఎం నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్టీల అధినేతలు, మిత్రపక్షాలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు ఆయన కేబినెట్ సహచరులంతా హాజరువుతారని సమాచారం. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రముఖులు వస్తుండడంతో.. పాట్నాలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే
Read Latest AP News And Telugu News