Share News

GBS Cases: ఏపీలో జీబీఎస్ కేసులు.. ముగ్గురు మృతి

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:29 PM

మహారాష్ట్ర, తెలంగాణలో విజృంభించిన జీబీఎస్ వ్యాధి ఇప్పుడు ఏపీలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు మూడు మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు, వైద్యులు చెబుతున్నారు.

GBS Cases: ఏపీలో జీబీఎస్ కేసులు.. ముగ్గురు మృతి
GBS Cases

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఇప్పటి వరకు జీబీఎస్ (GBS) కేసులతో (Cases) ముగ్గురు మృతి (Three Deaths) చెందారు. ప్రస్తుతం కర్నూలు (Kurnool)లో మరో కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరణాలు, కేసులు పెరుగుతుండడంతో ఆందోళన పెరుగుతోంది. మహారాష్ట్ర (Maharastra), తెలంగాణ (Telangana)లో విజృంభించిన జీబీఎస్ వ్యాధి ఇప్పుడు ఏపీలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టింది. ఇంకోవైపు గుంటూరు జీజీహెచ్‌లో నలుగురు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జీజీహెచ్‌లో ఇద్దరు మృతి చెందారు. అంతకుముందు ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ జీబీఎస్‌తో గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో మొత్తంగా ఏపీలో ఇప్పటి వరకు మూడు మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు, వైద్యులు చెబుతున్నా.. కేసులు నమోదుకావడం, మరణాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..


కాగా కర్నూలు జిల్లా వాసులను కొత్త వైరస్‌ వణికిస్తోంది. మొన్నటి వరకు మహారాష్ట్ర, తెలంగాణల్లో కలకలం రేపిన గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) ప్రస్తుతం రాష్ట్రంలో కూడా చాపకింద నీరులా వ్యాపించింది. జీబీఎస్‌ లక్షణాలతో 44 ఏళ్ల మహిళ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆరు రోజుల క్రితం తీవ్ర జ్వరం, కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఫీమేల్‌ మెడికల్‌ వార్డులో ఆమె అడ్మిట్‌ అయింది. రోగికి పరీక్షలు నిర్వహించగా.. జీబీఎస్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో మహిళను ఏఎంసీ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుతో కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు అప్రమత్తమయ్యారు. గురువారం సూపరింటెండెంట్‌ చాంబరులో జీబీఎస్‌ వ్యాధి నివారణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి కలుషిత ఆహారం వల్ల సోకుతుందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. జీజీహెచ్‌లో చికిత్సకు అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గులియన్‌బారే సిండ్రోమ్‌కు నోడల్‌ ఆఫీసర్‌గా మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డమం శ్రీనివాసులును నియమించారు. ఈ సమావేశంలో సీఎస్‌ఆర్‌ఎంవో బి.వెంకటేశ్వర్లు, న్యూరాలజి హెచ్‌ఓడీ సి.శ్రీనివాసులు, మెడిసిన్‌ హెచ్‌ఓడీ ఇక్బాల్‌ హుశేన్‌, పీడీయాట్రిక్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి, అడ్మినిస్ర్టేటర్లు శివబాల, కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.


జీబీఎస్‌ లక్షణాలు

జీబీఎస్‌ వ్యాధి. ఇది ఒక అరుదైన నరాల వ్యాధి. దీన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధి అని కూడా అంటారు. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ, నరాలపై ఈ వైరస్‌ దాడి చేస్తుంది. ఫలితంగా కండరాల బలహీనత, గొంతునొప్పి, నడవలేని స్థితి, అలిసిపోయినట్లుగా అనిపిస్తుంది. మొదటి దశలో చికాకు, నడుమునొప్పి ఉంటుంది. పెరాల్సిస్‌ మాదిరి పాదాలు, చేతులు, ముఖం నిశ్చేష్టంగా ఉంటుంది. చర్మంలో సూదిగుచ్చినట్లుగా అనిపిస్తుంది. కొన్ని కేసుల్లో కండరాలు పూర్తిగా పని చేయకపోవడం గుండె వేగం మారడం, ఊపిరితిత్తుల సమస్యలు సంభవిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై వెంటిలేటర్‌ అవసరం అవుతుంది. ముఖం, కంటి కండరాలపై ప్రభావం కొన్ని సందర్భాల్లో ముఖ నరాలు ప్రభావితమవుతాయి.


ఎదుర్కొనేందుకు సిద్ధం.. డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు

ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు అన్నారు. జీబీఎస్‌ వ్యాధి నివారణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇమ్యూనోగ్లోబిన్‌ ఇంజెక్షన్లు మందులు అందుబాటులో ఉంచామని, ప్రత్యేకంగా వైద్యులతో నోడల్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇది అంటువ్యాధి కాదని, ప్రజలు ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని అయన అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెట్రోల్ బంకులో ఘరానా మోసం..

సీఆర్ పాటిల్‌ను కలిసిన చంద్రబాబు, పవన్

బంజారాహిల్స్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 21 , 2025 | 12:29 PM