Ballikurava Granite Quarry: బల్లికురవ గ్రానైట్ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:48 PM
బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.

బాపట్ల: జిల్లాలోని బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో (Ballikurava Granite Quarry) ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో క్వారీలో 16మంది పనిచేస్తున్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు క్వారీలో సహాయక చర్యలు చేపట్టారు.
బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలు జరగటం సర్వసాధారణం అయిపోయింది. క్వారీల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్వారీ ప్రమాదాలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ ఘటనపై విచారణ జరపాలి: సీఎం చంద్రబాబు
బల్లికురవ క్వారీ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో పాటు మరి కొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్వారీలో పనులు చేస్తున్న కార్మికులపై రాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారని అన్నారు. ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులతో సీఎం మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఘటనపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది: మంత్రి నారా లోకేష్
బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలవడం తనను తీవ్రంగా కలచివేసిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రమాదంలో రోజువారీ కూలీలు మృతిచెందడం బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యసాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి కొలుసు పార్థసారథి
బల్లికురవ క్వారీ ప్రమాదంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ ద్వారా మాట్లాడారు. రెస్క్యూ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కలెక్టర్‌కు సూచించామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు.
క్వారీ ప్రమాదంపై మంత్రుల దిగ్భ్రాంతి
బాపట్ల జిల్లాలో గ్రానైట్ క్వారీ ప్రమాదంపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో రాయిపడి ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సానుభూతి తెలిపారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర..
బల్లికురవ క్వారీ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందడం బాధాకరమని ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి టీజీ భరత్..
For More AP News and Telugu News