APPSC : సులభంగా గ్రూప్-2 మెయిన్స్
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:51 AM
గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు.

ప్రాథమికాంశాలపై సూటిగా ప్రశ్నలు
పరీక్షలకు 92 శాతం మంది హాజరు
ఏపీ చరిత్రలో ‘వీర తెలంగాణ’పై ప్రశ్న
ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ఈ నెల 27 వరకూ అభ్యంతరాల స్వీకరణ
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): గందరగోళ వాతావరణంతో తీవ్ర ఉత్కంఠ రేపిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులు తీవ్రస్థాయిలో సన్నద్ధం కాగా పేపర్లు సులభంగా వచ్చాయి. సబ్జెక్టులో మరీ లోతుగా వెళ్లకుండా చాలావరకు ప్రశ్నలను ప్రాథమిక అంశాల(బేసిక్స్)పైనే ఇచ్చారు. గతంలో ప్రకటనలు (స్టేట్‌మెంట్లు) ఇచ్చి వాటిలో సరైనవి గుర్తించడం లాంటి ప్రశ్నలు అధికంగా ఉండేవి. కానీ, ఈసారి మాత్రం నేరుగా సమాధానం అడిగిన ప్రశ్నలు ఎక్కువగా రావడంతో అభ్యర్థులకు సమయం కూడా సరిపోయింది. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగంపై ఉదయం జరిగిన పేపర్-1 సులభంగానే ఉందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. చరిత్రలో చాలా సులభమైన ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన జరిగిన ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్-2 కూడా పెద్ద కష్టంగా లేదని అభ్యర్థులు వెల్లడించారు. పేపర్లు సులభంగా రావడంతో కటాఫ్ మార్కులు భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రశ్నలు సులభంగా ఇవ్వడంపై కొందరు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివి, గ్రూప్-2కు సన్నద్ధమయ్యామని, పేపరు చూస్తే కొద్దికాలం నుంచి చదివినవారు కూడా ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసే స్థాయిలో ఉందని వాపోతున్నారు. ఇదే గ్రూప్-2 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా వచ్చింది.
అందువల్లే ఎక్కువ మందికి అవకాశం కల్పించడం కోసం కూటమి ప్రభుత్వం మెయిన్స్‌కు 1:50కి బదులుగా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రిలిమ్స్ కఠినంగా రావడంతో మెయిన్స్ ఇంకా కష్టంగా ఉంటుందని అభ్యర్థులు అంచనా వేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సులభమైన ప్రశ్నలతో ప్రశ్నపత్రం రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్రలో భాగంగా ‘వీరతెలంగాణ అనుభవాలు, జ్ఞాపకాలు’ రచయిత ఎవరునే తెలంగాణకు సంబంధించిన ప్రశ్న అడగడం అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎకనామీ పేపరులో ఏపీ కంటే భారత ఎకానమీపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. విభజన చట్టంలోని సంస్థలు ఎక్కడున్నాయి? కేంద్ర ప్రభుత్వ పథకాలు, జల్‌జీవన్ మిషన్‌పై ప్రశ్నలు వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ ప్రశ్నలు కఠినంగా లేవు. రెండు పేపర్లలోనూ గతంలో అడిగిన పలు ప్రశ్నలు ఇప్పుడూ కనిపించాయి. మెయిన్స్‌కు మొత్తం 92,250 మంది ఎంపికకాగా, వారిలో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. పేపర్-1కు 79,599 మంది, పేపర్-2కు 79,451 మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా, గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రెండు పేపర్లకు సంబంధించి ఏపీపీఎస్సీ ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27 వరకూ అభ్యంతరాలను తెలపడానికి గడువు ఇచ్చింది. అనంతరం తప్పులను సరిచేసి తుది ‘కీ’ విడుదల చేయనుంది.
గ్రూప్-1 హాల్‌టికెట్‌తో..
అనంతపురం టౌన్, ఫిబ్రవరి23 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలో నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఓ అభ్యర్థి గ్రూప్-1 హాల్‌టికెట్‌తో వచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా ఆమడగూరు మండలానికి చెందిన ఆంజనేయులు పరీక్ష రాయడానికి అనంతపురంలోని ఎస్‌ఎ్‌సబీఎన్ కేంద్రానికి వచ్చారు. పరీక్ష కేంద్రంలో తన హాల్ టికెట్ నంబరు కనిపించలేదు. అక్కడున్న అధికారులు అతని హాల్‌టికెట్‌ను పరిశీలించి, అది గ్రూప్-1 పరీక్షదిగా గుర్తించారు. అప్పటికి 12 నిమిషాల సమయం మాత్రమే ఉంది. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ జాఫర్ విషయం తెలుసుకుని, అభ్యర్థిని సమీపంలో ఉన్న ఎస్పీ బంగ్లాకు తీసుకెళ్లారు. అక్కడ ఆన్‌లైన్‌లో గ్రూప్-2 హాల్‌టికెట్ తీయించి, పరుగున పరీక్షా కేంద్రంలోకి పంపించారు.
విజయవాడ నుంచి వచ్చినా నిరాశే
అనంతపురానికి చెందిన గణేశ్ గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని శనివారం విజయవాడలో చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. పరీక్షలు నిర్వహిస్తారని తేలిపోవడంతో విజయవాడ నుంచి వాహనం అద్దెకు తీసుకుని, పరీక్ష రాయడానికి శారదానగర్‌లోని కేఎ్‌సఎన్ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రం వద్దకు చేరుకున్నారు. అప్పటికే 9.50గంటలు అయిందని అధికారులు కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో గణేశ్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, విశాఖపట్నం నగరం కొమ్మాదిలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షకు హాజరైన అభ్యర్థి పి.గంగరాజు అస్వస్థతకు గురికాగా, వెంటనే సమీపంలోని గాయత్రి వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందించారు.