Share News

Minister Payyavula Keshav : ప్రజల కోసం పనిచేయడమే చంద్రబాబుకున్న వ్యసనం

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:40 AM

శాసనసభలో బడ్జెట్‌పై మంత్రి సమాధానం ఇచ్చారు. ‘ప్రతి నిత్యం పని, పని అంటూనే ఉంటారు. ప్రతీది తెలుసుకోవాలి. దాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగించాలని నిరంతరం తాపత్రయ పడుతూ ఉంటారు.

Minister Payyavula Keshav : ప్రజల కోసం పనిచేయడమే చంద్రబాబుకున్న వ్యసనం

  • సీఎం గురించి గొప్పలు చెప్పడం కాదు.. గొప్పగా చెప్పాలి

  • వైసీపీ సమాజానికి హానికరం.. అందుకే 11 స్థానాలకే పరిమితం

  • బడ్జెట్‌పై అసెంబ్లీలో ఆర్థికమంత్రి పయ్యావుల

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రజల కోసం పనిచేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న వ్యసనమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. మంగళవారం శాసనసభలో బడ్జెట్‌పై మంత్రి సమాధానం ఇచ్చారు. ‘ప్రతి నిత్యం పని, పని అంటూనే ఉంటారు. ప్రతీది తెలుసుకోవాలి. దాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగించాలని నిరంతరం తాపత్రయ పడుతూ ఉంటారు. ప్రజల కోసం ప్రతి అంశాన్ని తెలుసుకోవడం చంద్రబాబుకున్న పెద్ద వ్యసనం. ఈ మాట నేను చెప్పడం లేదు. అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. సీఎం గురించి గొప్పలు చెప్పడం కాదు.. గొప్పగా చెప్పాలి. ఆయన తెచ్చిన సంస్కరణలు రాష్ట్ర ప్రజల దిశ, దశను మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థలను రాష్ట్రానికి రప్పించిన ఘనత ఆయనదే. ప్రపంచ బ్యాంకుతో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరిపింది దేశంలోనే మొదటిసారి చంద్రబాబు పాలనలోనే. ఎన్ని విమర్శలెదురైనా తన పని తాను చేసుకుంటూ పోయే కర్మయోగి చంద్రబాబు. డ్వాక్రా సంఘాలను అమల్లోకి తెస్తే నానా విమర్శలు చేశారు. ఇప్పుడు మహిళల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయంటే చంద్రబాబు వేసిన పునాదే కారణం’ అని పయ్యావుల తెలిపారు.


బ్రాండ్‌ చంద్రబాబే శ్రీరామరక్ష

‘సిగరెట్‌ పెట్టెల మీద హెచ్చరికలు ముద్రించినట్టు ‘వైసీపీ సమాజానికి హానికరం’ అని సమాజానికి పదేపదే చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. సభకు రాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయట కూర్చొని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ హానికరమనే విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. అందుకే ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారు. వైసీపీ హయాంలో 9శాతానికి పైగా వడ్డీ రేట్లు ఉన్న అప్పులు దాదాపు 141 ఉన్నాయి. ఇంకొన్ని 13.4 శాతం వడ్డీకి తెచ్చారు. ఏపీ పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా 13.4 శాతం వడ్డీకి అప్పులు తీసుకొచ్చారు. ఈ ఒక్క అప్పుపై వడ్డీ తగ్గించడానికి బ్యాంకర్లు ఒప్పుకుంటే రూ.6.76కోట్ల మేర భారం తగ్గుతుంది. ఈఏపీ ప్రాజెక్టులనూ గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఛిన్నాభిన్నం చేసేసింది. 11 పథకాలు దాదాపు రూ.27,250 కోట్ల కేటాయింపులతో ఉన్నాయి. ప్రభుత్వం వైపునుంచి సరైన చెల్లింపులు లేక ప్రపంచ బ్యాంకు, ఎన్‌డీబీ, ఏఐబీ, ఏడీబీ, జైకా, కేడబ్ల్యూఎఫ్‌ సహకారంతో చేపిట్టిన ప్రాజెక్టులు ఆగిపోయాయి. తిరిగి వాటిని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరపతి పోగొట్టారు. బ్రాండ్‌ చంద్రబాబే శ్రీరామరక్షగా నిలుస్తోంది.’


సంక్షేమానికి లోటు లేకుండా ప్రణాళికలు

గతంలో పింఛన్లు రూ.200 నుంచి రూ.2,000కు, ఇప్పుడు రూ.4,000కి పెంచిన ఘనత మా ప్రభుత్వానిదే. ప్రతినెలా దాదాపు 63.36 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఏడాదికి రూ.32,520 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నాం. దేశంలో మన రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్లు పంపిణీ చేస్తోంది. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమానికి లోటులేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సాకీ పథకం ద్వారా కేంద్రం అన్ని రాష్ట్రాలకు పెట్టుబడి వ్యయంచేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ వ్యయ ప్రతిపాదనలపై దీర్ఘకాలికరుణాలు ఇస్తోంది. ఇవి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రావు, వీటిపై వడ్డీ ఉండదు. వీటిని 50 ఏళ్ల తర్వాత చెల్లించాలి. గత ప్రభుత్వం రూ.4,079 కోట్లు తెస్తే కూటమి ప్రభుత్వంలో 8నెలల్లోనే రూ7,203కోట్లు రుణంగా తీసుకున్నాం. గతప్రభుత్వం భవిష్యత్తు మద్యం ఆదాయాన్నీ తాకట్టు పెట్టేస్తే.. కూటమి ప్రభుత్వం మాత్రం 50ఏళ్ల వరకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేనివిధంగా రుణాలను తీసుకొస్తోంది.’ అని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.


ఈ బడ్జెట్‌ అభివృద్ధికి మైలురాయి

వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం బాధ్యతారాహిత్యం

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు

విధ్వంసకర పాలన తర్వాత కూటమి ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్‌.. రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి లాంటిదని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చేవిధంగా బడ్జెట్‌ ఉందన్నారు. ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ వైసీపీ హయాంలో నీటిపారుదల రంగానికి ఇవ్వాల్సిన బిల్లుల బకాయిలను కూటమి సర్కార్‌ చెల్లించిందన్నారు. గత పాలకులతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, బడ్జెట్‌ సర్వజనులకు ఉపయోగకరంగా ఉందన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేవిధంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఇవ్వాలన్నారు. షేక్‌ షాజహాన్‌ బాషా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు. జగన్‌ ప్రభుత్వం మిగిల్చిన రోడ్లను పూడ్చేందుకు రూ.800 కోట్లు చాలలేదన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గత ప్రభుత్వ దాష్టీకంతో బీసీలు ఇబ్బందులు పడ్డారని, ఈ సర్కార్‌ రూ.46 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి ఊరటనిచ్చిందన్నారు. యనమల దివ్య మాట్లాడుతూ చంద్రబాబు మహిళా పక్షపాతి అని, ఈ బడ్జెట్‌లో అది ప్రతిబింబిస్తోందన్నారు. మామిడి గోవిందరావు మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని అన్నారు. బీజేపీ సభ్యులు ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఖర్చు చేయాలన్నారు. జగన్‌ పోలవరానికి పుల్లపెట్టాడని, అమరావతికి అగ్గిపెట్టారని, పేదలకు ఇళ్లు కట్టించకుండా ఆయన మాత్రం ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. నాసిక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. ఆనందరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన తర్వాత.. కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 04:41 AM