Share News

Macherla violence : టీడీపీ నేతలపై దాడి చేసిన తురకా కిశోర్‌ అరెస్టు

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:11 AM

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తురకా కిశోర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

 Macherla violence : టీడీపీ నేతలపై దాడి చేసిన తురకా కిశోర్‌ అరెస్టు

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా అరాచకాలు

  • మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ప్రధాన అనుచరుడు

  • కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అజ్ఞాతంలోకి

  • ఎట్టకేలకు హైదరాబాద్‌లో అదుపులోకి

మాచర్లటౌన్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తురకా కిశోర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేశారు. కిశోర్‌ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అరాచకాలకు పాల్పడి పలు కేసులలో నిందితుడిగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ నుంచి మాచర్లకు బయలుదేరిన టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలపై దాడి చేసిన కేసులో కిశోర్‌ ప్రధాన నిందితుడు. 2022 డిసెంబరు 16న మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై దాడి చేసిన అనంతరం కిశోర్‌ వైసీపీ నాయకులను వెంటబెట్టుకొని టీడీపీ ఆస్తులను, పార్టీ కార్యాలయంతోపాటు వాహనాలను ధ్వంసం చేసిన ఘటనల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2024 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజున హింసాకాండకు పాల్పడ్డారు. రెంటచింతల మండలం పాలువాయిగేటులో పోలింగ్‌ రోజు అక్కడ ఏజెంట్‌గా ఉన్న నంబూరి శేషగిరిరావుపై దాడిచేసి గాయపరిచారు. మాచర్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీలో టీడీపీ నేత యెనుముల కేశవరెడ్డి ఇంటిపై విధ్వంసానికి పాల్పడి పలువురిని గాయపరిచారు.


పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామిపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడిచేయడంతోపాటు టీడీపీ నేతల వాహనాలు ధ్వంసం చేసి వారి గృహాల్లో లూటీ చేసిన కేసుల్లోనూ కిశోర్‌ ప్రధాన నిందితుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కిశోర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెలలు గడుస్తున్నా నిందితుడిని పట్టుకోకపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విజయపురిసౌత్‌ ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ షఫీ.. కిశోర్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి హైదరాబాద్‌లో పట్టుకున్నారు.

టీడీపీ ఏజెంట్‌పై కర్రలతో దాడి..

గతేడాది సార్వత్రిక ఎన్నికల రోజు(మే 13న) పాలువాయిగేట్‌ గ్రామంలోని 202 పోలింగ్‌ బూత్‌లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న సమయంలో టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు రాగానే తురకా కిశోర్‌తోపాటు సర్పంచ్‌ చింతా సుబ్బయ్య కర్రలతో దాడిచేసి శేషగిరిరావును విచక్షణా రహితంగా కొట్టారు. ఆ ఘటనలో కిశోర్‌పై రెంటచింతల పోలీసుస్టేషన్‌లో 147, 148, 307, 324, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో 8వ నిందితుడిగా ఉన్న కిశోర్‌ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. పీటీ వారెంట్‌ ద్వారా కిశోర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడానికి పోలీసు యంత్రాంగం సమాయత్తమవుతోంది.


ఎన్‌కౌంటర్‌ చేసినా తప్పులేదు!: బుద్దా

వైసీపీ పాలనలో తాము ప్రయాణిస్తున్న కారుపై తురకా కిశోర్‌ పెద్దపెద్ద బాదులతో దాడి చేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తెలిపారు. చంపాలన్న ఉద్దేశంతోనే ఆ దాడి చేశారని, ఆ రోజు తానూ, బొండా ఉమా త్రుటిలో తప్పించుకున్నామని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు నాటి ఫొటోను బుద్దా వెంకన్న ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఇటువంటి ఆకురౌడీలు సమాజానికి హానికరమని, వారిని ఎన్‌కౌంటర్‌ చేసినా తప్పులేదని పేర్కొన్నారు. నాడు చైర్మన్‌ పదవి ఆశ చూపి తమపైకి తురకా కిశోర్‌ను వదిలారన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 04:12 AM