Motha Cyclone Compensation: తుఫాను పరిహారంపై మంత్రి కీలక ప్రకటన
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:31 PM
మొంథా తుఫాను పరిహారంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అలాగే తుఫాను సమయంలో బాధితులను ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుందనే విషయాలను తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమలాపురం, నవంబర్ 8: మొంథా తుఫాను సమయంలో జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) కొనియాడారు. శనివారం నాడు డీఆర్‌సీ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి రూ.3000, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇచ్చి పంపించామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో హెక్టారుకు రూ.20వేల పరిహారం ఉండగా.. వైసీపీ ప్రభుత్వం రూ.17 వేలకు తగ్గించిందని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రూ.25 వేలు చేశామని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం చేసిన రీసర్వే వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. వారు చేసిన రీసర్వే వల్ల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు అతి ప్రధానమైన సమస్య గోదావరి డెల్టా కాలువలని తెలిపారు. ఈ డెల్టా పంట కాలువలు పూడుకుపోవడం వల్ల వ్యవసాయాలు పాడవుతున్నాయని చెప్పారు. ఎంత డబ్బు ఖర్చయినా సరే ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని నీటిపారుదల వ్యవస్థను బాగు చేసేందుకు ప్రభుత్వ ఆలోచిస్తోందన్నారు. దీని కోసం సమగ్ర సర్వే చేసేందుకు రూ.12 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.
టిడ్కో ఇళ్లను 5 సంవత్సరాలు మరుగున పెట్టింది గత వైసీపీ ప్రభుత్వమని మండిపడ్డారు. మార్చ్‌లోగా అన్ని ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయిస్తామని స్పష్టం చేశారు. తుఫాను పంట పరిహారం అంచనాలు వచ్చాయని.. వాటిని కేంద్రానికి పంపిస్తున్నామని తెలిపారు. కేంద్రం సహకారంతో త్వరలోనే పరిహారం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబుల హంగామా.. ఏం జరిగిందంటే
కుప్పంలో ఏడు ప్రాజెక్టులకు శంకుస్థాపన.. భారీగా ఉద్యోగావకాశాలు
Read Latest AP News And Telugu News