CM Reacts Kakinada Incident: కాకినాడ జీజీహెచ్ ఘటన.. వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:57 AM
CM Reacts Kakinada Incident: రంగరాయ వైద్య కళాశాల వేధింపుల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ మేరకు వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు.

అమరావతి, జులై 11: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఘటనపై (RMC Kakinada Incident) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీ విద్యార్థినులపై లైంగిక వేధింపుల విషయంలో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులను నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదికను సమర్పించారు.
మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్‌గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈనెల 9న విద్యార్థినులు కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. దీనిపై అదే రోజు కమిటీని నియమించి విచారణ చేపట్టారు. నిన్న (గురువారం) రాత్రి వరకు విద్యార్థినులతో విచారణ కమిటీ మాట్లాడి నివేదిక సిద్దం చేసింది. చక్రవర్తితోపాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
నలుగురి సస్పెండ్..
మరోవైపు వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాల కృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ నలుగురిపై పోలీసు కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఘటనపై నివేదికను, తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాకినాడ జీజీహెచ్ అధికారులు పంపించారు.
ఇదీ జరిగింది...
కాగా.. రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులను ల్యాబ్ అటెండెంట్ లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా విధుల్లో నిమగ్నమై ఉండగా అసభ్యకరమైన ఫొటోలు తీసి వాట్సాప్‌లకు పంపించేవాడని, రూమ్‌కు రమ్మని బెదిరించేవాడని, డబ్బులు ఎరవేసేవాడని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈనెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరుగగా.. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
టీటీడీలో ఆ ఉద్యోగులను తక్షణమే తొలగించాలి.. బండి సంజయ్ డిమాండ్
అలాంటి ఫొటోలు తీయకండి.. పాపరాజీలపై హీరోయిన్ ఆగ్రహం..
Read Latest AP News And Telugu News