Rajamahendravaram: రోడ్డు డైవర్షన్‌లో కాచుకున్న మృత్యువు
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:40 AM
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద రోడ్డు డైవర్షన్‌లో నిలిపిన పాల వ్యాన్‌ను ఢీకొన్న కారు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కాకినాడ నుండి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది.

ఆగి ఉన్న పాలవ్యాన్‌ను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి.. తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
రంగంపేట/రాజమహేంద్రవరం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రోడ్డు డైవర్షన్ వద్ద ఆగి ఉన్న పాలవ్యాన్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలోని రఘునాథపురం గ్రామానికి చెందిన రేలంగి శివన్నారాయణ,రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని కవలగొయ్యికు చెందిన తీగిరెడ్డి శివ బావాబామ్మర్దులు. శివన్నారాయణకు కవల పిల్లలు వర్షిత, హర్షిత ఉన్నారు. వీరిద్దరికి ఆధార్ అప్‌డేట్ చేసుకోవడం కోసం గత కొద్ది రోజులుగా కాకినాడ కలెక్టరేట్‌కు వెళ్లి వస్తున్నా పనికాలేదు. ఈ క్రమంలో శివన్నారాయణ (40), ఆయన భార్య దేవిలలిత (34), వారి పిల్లలు వర్షిత (13), హర్షిత (13), ఆయన బావమరిది శివ (30), భార్య భవాని (26), కుమార్తె సాన్వి(4) అందరూ కలిసి సోమవారం కారులో మళ్లీ కాకినాడ వెళ్లారు. కాకినాడ బీచ్ వద్ద కాసేపు సరదాగా గడిపి, సాయంత్రం 5 గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరారు. రాజానగరం-సామర్లకోట ఏడీబీ రోడ్డు విస్తరణలో భాగంగా రంగంపేట మండలం వడిశలేరు గ్రామం వద్ద ఒక డైవర్షన్ ఉంది. అక్కడే రోడ్డు పక్కన పాల వ్యాన్‌ను ఆపిన డ్రైవర్ పెట్రోల్ బంక్ వద్దకు మంచినీళ్లకు వెళ్లాడు. సుమారు 6 గంటల సమయంలో శివన్నారాయణ కారును వేగంగా నడుపుతూ.. డైవర్షన్ తీసుకునే సమయంలో అక్కడ ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొట్టాడు.