Daughter in law killed Mother in law: అత్తతో ఆటాడిన కోడలు.. కాళ్లు, చేతులు కట్టేసి..
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:36 AM
అయ్యో.. మా అత్త మంటల్లో కాలిపోతోంది.. ఎవరైనా వచ్చి కాపాడండి.. అంటూ రోదిస్తున్న కోడలిని చూసి అంతా పరుగుపరుగున వచ్చారు. అయితే అప్పటికే ఆమె అత్త మంటల్లో కాలి చనిపోయింది. అంతా ఇది అగ్నిప్రమాదం అనే అనుకున్నారు. కానీ చివరకు కోడలి దొంగా పోలీస్ ఆట గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఒక మనిషిని చంపేంత నిర్ణయం తీసుకున్నారంటే.. దాని వెనుక ఎంతో పెద్ద సమస్య ఉంటుంది. కానీ ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకూ ప్రాణాలు తీసేంత వరకూ వెళ్తున్నారు. కొందరైతే మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల వివాహేతర సంబంధాలకు అడ్డుపడుతున్నారని, ఫోన్ చూడొద్దు అన్నారని, ప్రియుడితో మాట్లాడొద్దు అని కండీషన్లు పెడుతున్నారంటూ కోపాలు పెంచుకుని చివరకు ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా, విశాఖలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పదే పదే విసిగిస్తోందని ఓ కోడలు.. అత్తను చంపేసింది. దొంగ.. పోలీస్ ఆట పేరుతో ఆమె వేసిన ప్లాన్ తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం (Visakhapatnam) పెందుర్తికి చెందిన జయంతి కనక మహాలక్ష్మి (66) అనుమానస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం మేరకు.. అగ్నిప్రమాదం జరిగి తన అత్త చనిపోయిందని చెప్పిన కోడలు లలితే ఆమెను హత్య చేసినట్లు తెలిసింది. తన పేరు బయటికి రాకుండా ఉండేందుకు అగ్నిప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించినట్లు తెలిసింది. అయితే ఆమె తన అత్తను చంపే క్రమంలో (daughter in law killed mother in law) వ్యవహరించిన తీరు పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.
హత్య చేసినట్లు తెలీకుండా ఉండేందుకు కోడలు వినూత్న పథకం పన్నింది. దొంగ - పోలీస్ ఆట ఆడదామని అత్తను నమ్మించింది. ఆమె మాటలకు సరే అని చెప్పడంతో తన పథకాన్ని అమలు చేసింది. కుర్చీపై కూర్చున్న అత్త కాళ్లు, చేతులు కట్టేసింది. ఆ తర్వాత కళ్లకు గంతలు కూడా కట్టేసింది. తర్వాత పెట్రోల్ తీసుకొచ్చి ఆమెపై పోసింది. చివరగా ఆమెపై దేవుడి గదిలో ఉన్న దీపాన్ని విసిరేసింది. మంటలు చెలరేగగానే తలుపులు వేసి బయటికి పారిపోయింది. అయ్యో.. మా అత్త మంటల్లో కాలిపోతోంది.. అంటూ గట్టిగా ఏడుస్తూ అందరినీ నమ్మించింది. దీంతో ముందు అందరూ అది అగ్నిప్రమాదం అనే అనుకున్నారు.
పోలీసులకు కూడా మొదట అగ్రిప్రమాదం అని కేసు నమోదు చేసి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే వారి దర్యాప్తులో కోడలి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో లోతుగా విచారించగా కోడలు తన నేరాన్ని అంగీకరించింది. అయితే చీటికీమాటికీ అత్త చిరాకుపెడుతుండడంతో చివరకు ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లు నిందితురాలు లలిత పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుబ్రహ్మణ్య శర్మ అనే వ్యక్తి.. భార్య లలిత, కొడుకు, కూతురుతో పెందుర్తి అప్పన్నపాలెంలో నివాసముంటున్నాడు. సుబ్రహ్మణ్య శర్మ తల్లి జయంతి కనకమాలక్ష్మి కూడా వారిపో పాటే ఉంటోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి..
ఆఫ్రికన్ నత్తలతో ఆందోళన వద్దు..
ఏపీలో పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్
Read Latest AP News And Telugu News