Public Administration : రేసు గుర్రాల్లో జోష్ ఏదీ!
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:05 AM
అఖిల భారత సర్వీసు అధికారి ఢిల్లీలోని హోటల్‌లో ఒక ప్రైవేటు వ్యక్తిని కలిశారు. భేటీ ముగించుకొని బయటకు రాగానే... ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్!

కార్యదర్శుల స్థాయిలో కనిపించని చురుకు
శాఖలను నడిపించాల్సిన సారథులు వీరే
అధికారులపై కొరవడిన సమర్థ పర్యవేక్షణ
శాఖలను ఇష్టారాజ్యంగా భావిస్తున్న కొందరు
కీలక జీవోల జారీలోనూ గజిబిజి తీరు
బేరాల కోసం వ్యూహాత్మకంగా ఫైళ్ల పెండింగ్
ఇప్పటికీ హైదరాబాద్‌లోనే వీకెండ్ మకాం
ఇలాగైతే పాలనలో పరుగు ఎలా?
ఐఏఎస్ అంటేనే కీలకం! కార్యదర్శి, ఆ పైస్థాయి అంటే మరింత కీలకం! శాఖలకు సారథులు వీరే! విధాన నిర్ణయాలు తీసుకునేది మంత్రివర్గం! కానీ.. ఆ నిర్ణయం పూర్వాపరాలు, మంచీ చెడూ, న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించి సమగ్రమైన విధానాన్ని తయారు చేసేది కార్యదర్శులే! జీవోలు ఇచ్చేది వీరే! అలాంటి కార్యదర్శులకు తమ బాధ్యతలపట్ల పూర్తి అవగాహన ఉండాలి. కేబినెట్ తీసుకునే నిర్ణయాల అమలుపై చిత్తశుద్ధి ఉండాలి! కానీ.. జగన్ హయాంలో వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. ‘పరిగెత్తండి’ అని ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నా.. కార్యదర్శుల్లో పలువురు కాలు కదపడంలేదు. కేబినెట్ ఆదేశించిన సాయంత్రానికే జీవోలు వచ్చే రోజులు పోయి.. వారాలు గడుస్తున్నా జారీకాని పరిస్థితి వచ్చింది. సరైన అజమాయిషీ లేకపోవడం.. చిత్తశుద్ధి లోపించడం.. గత ఐదేళ్ల జాడ్యం వీడకపోవడం! కారణం ఏదైనా సరే... ఇప్పుడు కార్యదర్శులు, ఆపైస్థాయి యంత్రాంగంలో చురుకుదనం లోపించిందనే అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టి సారించారు. కార్యదర్శులను కార్యోన్ముఖులను చేసే దిశగా మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఇది ఐదేళ్ల కిందటి సంగతి! కేంద్రంలో కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఓ అఖిల భారత సర్వీసు అధికారి ఢిల్లీలోని హోటల్‌లో ఒక ప్రైవేటు వ్యక్తిని కలిశారు. భేటీ ముగించుకొని బయటకు రాగానే... ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్! ‘‘మీరు కలిసింది సరైన వ్యక్తిని కాదు! మరోసారి ఇలాంటివి రిపీట్ చేయవద్దు’’ అని ఆ అధికారికి ఫోన్‌లో గట్టి హెచ్చరిక ఇచ్చారు.
అంటే, ఆ అధికారి ఎవరిని కలుస్తున్నారు? కలిసిన వ్యక్తి ఎలాంటి వాడో కూడా కనిపెట్టి హెచ్చరించారన్న మాట! మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక ఇలాంటి హెచ్చరికలు చాలా మంది బ్యూరోక్రాట్లకు జారీ అయ్యాయి. పద్ధతి మార్చుకోని వారిని కంపల్సరీ రిటైర్‌మెంట్ కింద ఇంటికి పంపించిన ఉదంతాలూ ఉన్నాయి! ఉన్నతస్థాయి అధికారులపై ఢిల్లీలో ఉండే నియంత్రణ, నిఘా ఇది! ఆయా అధికారులు బయట చేస్తున్న వ్యవహారాలపైనే ఇంతలా కన్నేసి ఉంచారంటే... ఆఫీసు వ్యవహారాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది! మరి... ఏపీలో ఏం జరుగుతోందో తెలుసా? ఏ బ్యూరోక్రాట్ ఏం పని చేస్తున్నారు? ఆఫీసుకు ఏ సమయంలో వస్తున్నారు? ప్రభుత్వ పనిచేస్తున్నారా? ప్రైవేటు పనుల్లో ఎక్కువ నిమగ్నమయ్యారా? ఎన్ని ఫైల్స్‌ను క్లియర్ చేశారు? ఏ ఫైలును ఎందుకు ఆపారు? ఆన్‌లైన్ పార్కింగ్‌లో ఎన్ని ఫైళ్లు దాచిపెట్టారు? దీనిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందా?... అంటే లేదనే చెప్పాలి. దీంతో పలువురు ఉన్నతస్థాయి అధికారులు ప్రభుత్వ పనికన్నా సొంతపనులపైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. కొందరు జగన్ అనుకూల అధికారులు మరో అడుగు ముందుకేసి కులం, మతం సంఘాల సమావేశాలను ఏర్పాటు చేయడంలో బిజీగా ఉంటున్నారు. మరి కొందరు ప్రాంతాల వారీగా భేటీలు జరుపుతున్నారు. తమను ప్రభుత్వం గమనిస్తోందన్న భయం లేకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శాఖలకు సారథుల్లాంటి అధికారులే ఇలా ఉంటే... ప్రభుత్వం తమ లక్ష్యాలను చేరుకునేదెలా అనే ప్రశ్న తలెత్తుతోంది.
వారే కీలకం...
సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనలో కీలకపాత్ర ఉన్నతాధికారులదే! ప్రభుత్వం రథమైతే... రేసుగుర్రాలు వీరే! కానీ... ఇప్పుడు వీరిలోనే జోష్ కనిపించడంలేదు. కేబినెట్ నిర్ణయంపై ఫైలు కదిలించి ఉత్తర్వులు జారీ చేయడంలో అధికారుల పాత్రే కీలకం! ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. నిజానికి... ఈ విషయంలో మంత్రుల పాత్ర చాలా పరిమితం. ఫైలు మొదలు పెట్టడం నుంచి చివరికి తీసుకు రావడంలో అధికారులదే కీలక పాత్ర. తమ విధానాల మేరకు ఉందో లేదో పరిశీలించి ఫైల్‌పై సంతకం చేయడానికే మంత్రి పరిమితం! కానీ... మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు! అధికారులను మినహాయించారు!
గజిబిజి నిర్ణయాలు..
ప్రభుత్వ విధానం, ఆలోచన ఒకటి! అధికారులు చేసేది మరొకటి! దీంతో... గజిబిజి జీవోలు వెలువడుతున్నాయి. తర్వాత తప్పు తెలుసుకుని వాటిని దిద్దుకోవాల్సి వస్తోంది. ఇటీవల ఇలాంటి అనేక ఘటనలు జరిగాయి. ఉదాహరణకు... ప్రభుత్వం కార్పొరేషన్‌ల చైర్మన్, సభ్యుల వేతనాల విషయంలో కేటగిరీలు విభజించి వివక్ష చూపించారు. ఈ వివక్షపై విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక... ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే... అందుకు అధికారులు ఏర్పాట్లు చేయాల్సిందే. అందుకు సంబంధించిన ఫైళ్లను పెండింగ్ పెట్టకూడదు. కానీ... ఈ విషయంలో కొందరు అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ప్రభుత్వం ముందు ‘ఎస్’ చెప్పేసి... ఆఫీసుకు వచ్చాక కొర్రీలువేసి ఫైలును పెండింగ్ కొండలో చేర్చుతున్నారు. కొందరు అధికారుల ‘ఇష్టాఇష్టాలు’ మరీ శ్రుతిమించిపోతున్నాయి. వ్యక్తిగతంగా కాసులు కురిపించే ఫైళ్లను భారీగా పెండింగ్ పెట్టి... తర్వాత బేరాలు కుదర్చుకుంటున్నారు. కొందరైతే ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలియకుండా, ఆన్‌లైన్ ఈ-ఆఫీస్ పార్కింగ్‌లో పెడుతున్నారు. వాటిని సెటిల్ చేయడం కోసం, తమకు అనుకూలమైన టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఫైళ్లపై పర్యవేక్షణ లోపించి ఏ ఫైల్‌ను, ఎందుకు పెండింగ్‌లో పెట్టారో కూడా ప్రభుత్వానికి తెలియని పరిస్థితి ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
పని చేయించుకోవాలి కదా...
కార్యదర్శుల స్థాయిలో అధికారుల కొరత ఉన్న మాట నిజమే! అయితే... గతంలో జగన్‌కు అనుకూలంగా పనిచేశార ని కొందరు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. వారు ఏ పనీ చేయకుండా వేతనాలు, అలవెన్సులూ, ఇతర సదుపాయాలన్నీ పొందుతున్నారు. ఖాళీగా ఉండే కొందరు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. దీనివల్ల ఇతర అధికారులపై పని భారం పెరుగుతోంది. అలా కాకుండా... ఖాళీగా ఉన్న అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించి వారి పనితీరుపై పర్యవేక్షణ కొనసాగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్‌తో బాగా అంటకాగిన ఓ అధికారి ఇప్పుడు ఖాళీగా ఉంటూ... కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కులాలను రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది.
అదే అరాచకం...
ఐదేళ్ల జగన్ జమానాలో నెలకొన్న అరాచకం ఇప్పటికీ కొనసాగుతోంది. కొందరు అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండటం లేదు. హైదరాబాద్‌లో మకాం ఉంటూ అమరావతిలో అద్దె పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు వెళ్లి... సోమవారం నింపాదిగా అమరావతికి వచ్చేవాళ్లు అత్యధికులు! రెగ్యులర్ పోస్టుతోపాటు ఆయా శాఖల అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) చూస్తున్న పెద్దసార్లు కొందరు ప్రభుత్వ కార్లను విచ్చలవిడి గా వినియోగిస్తున్నారు. అధికారులకూ హాజరు తప్పనిసరి. కానీ... ఎవరూ పట్టించుకోరు. కొందరు అధికారులు ఎప్పుడు ఆఫీసుకు వస్తారో, ఏ సమయంలో ఎక్కడ ఉంటారో కూడా తెలియడంలేదు. విజిటింగ్ అవర్స్‌లో ప్రజలకు అందుబాటులో ఉండటంలేదు. ముఖ్యమంత్రి సమీక్షలు ఉన్నప్పుడు మాత్రం సచివాలయానికి వచ్చి హడావుడి చేసే అధికారులూ ఉన్నారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?