Share News

Accident: జాతర ప్రయాణంలో విషాదం

ABN , Publish Date - Mar 02 , 2025 | 02:09 AM

ముందు వెళుతున్న ఆటోను అధిగమించే క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Accident: జాతర ప్రయాణంలో విషాదం
రవితేజ మృతదేహం

శాంతిపురం, మార్చి 1(ఆంధ్రజ్యోతి):ముందు వెళుతున్న ఆటోను అధిగమించే క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.... బైరెడ్డిపల్లె మండలం మూగనపల్లెకు చెందిన మునిరాజు భార్య తులసమ్మ (45) తన కుమారులు పవన్‌కుమార్‌(28), రవితేజ (25)లతో కలసి ద్విచక్ర వాహనంపై శాంతిపురం మండలం సోగడబల్లలో జరిగే జాతరకు శనివారం మధ్యాహ్నం బయల్దేరారు. కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలోని మఠం వద్దకు రాగానే కుప్పం వైపు నుంచి వి.కోట వైపు వస్తున్న ఓ లారీ ముందు వెళుతున్న ఆటోను అధిగమించే క్రమంలో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. అదే లారీ వీరి వెనుక మరో ద్విచక్ర వాహనంపైౖ వస్తున్న వి.కోటకు చెందిన రాజేష్‌(25)నూ ఢీకొంది.ఈ ఘటనల్లో తులసమ్మ,రవితేజ మృతి చెందగా, పవన్‌కుమార్‌,రాజేష్‌ తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పవన్‌కుమార్‌, రాజేష్‌లను 108 అంబులెన్స్‌ ద్వారా కుప్పం పీఈఎస్‌ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వీరిలో పవన్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులకు స్థానికులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించిన రాళ్ళబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 02 , 2025 | 02:09 AM