Parakamani Case: సతీష్ మరణంపై శాలివాహన కుమ్మర సంఘం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:48 PM
టీటీడీ పరాకమణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సతీష్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని పేర్కొంది.
తిరుపతి, నవంబర్ 17: పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉంటూ మృతి చెందిన సతీష్ మరణంపై శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం స్పందించింది. సతీష్ కుమార్ వాంగ్మూలం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భయపడిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆరోపించింది. పోలీసు వ్యవస్థలో కీలకమైన పదవిలో ఉన్నటువంటి ఒక అధికారిని అత్యంత కౄరంగా హతమార్చినా ఇప్పటి వరకు ఇందులో ముద్దాయిలను అరెస్టు చేయకపోవడం దారుణమని మండిపడింది.
సతీష్ కుమార్ మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అతడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గానీ, గుంతకల్ రైల్వే స్టేషన్‌లో స్కూటర్ పార్కింగ్ చేసేటప్పుడు గానీ ఎలాంటి అనుమానాస్పద ప్రవర్తన గానీ, భయభ్రాంతులకు గురైనట్టుగాని కనిపించలేదని పేర్కొంది. ఎన్నో క్లిష్టమైన కేసులను కూడా సునాయాసంగా పరిష్కరించిన ప్రతిభావంతుడు, ధైర్యశాలి ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని తెలిపింది.
ఆత్మహత్య అయితే అందుకు గల కారణాలను తనపై అధికారులకు లేదా.. న్యాయమూర్తులకు సతీష్ తెలపలేదని పేర్కొంది సంఘటన జరిగిన చోట, ఆయన దుస్తుల్లో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదని తెలిపింది. ఒక పోలీస్ అధికారి అయ్యుండి సూసైడ్ నోటు రాయకుండా, తన కుటుంబ సభ్యుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా చనిపోయే అవివేకి కాదని కుమ్మర సంక్షేమ సంఘం వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి...
స్టీల్ ప్లాంట్‌పై అపోహలు సృష్టించే యత్నం.. వైసీపీపై పల్లా సీరియస్
Read Latest AP News And Telugu News