TDP: కుప్పంనుంచే ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’!
ABN , Publish Date - Jun 30 , 2025 | 02:12 AM
ఏడాదికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ అనే వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని సొంత నియోజకవర్గమైన కుప్పంనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. శాంతిపురం మండలం తిమ్మరాజు పల్లెలో ఈనెల 2వ తేదీన ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడానికి, అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.తుమ్మిశివద్ద బహిరంగ సభ కూడా అదే రోజు జరుగనుంది ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కుప్పం పర్యటనకు రానున్నారు.

ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రతిష్ఠాత్మక కార్యక్రమం
కుప్పం/శాంతిపురం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీని పటిష్ఠం చేయడంతోపాటు ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందించడానికి తగిన విధంగా ప్రణాళికను చంద్రబాబు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే శాంతిపురం మండలం కడపల్లె వద్ద ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కూడా చేశారు. తరచూ నియోజకవర్గాన్ని సందర్శిస్తూ తెలుగుదేశం పార్టీని పటిష్ఠం చేయడానికి, అధికార వర్గాలను మరింతగా నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే 2వ తేదీన ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని కుప్పంనుంచే ప్రారంభించనున్నారు. మంగళవారం రాత్రికి కుప్పం చేరుకోనున్న చంద్రబాబు కడపల్లెలోని సొంతింట్లో రాత్రి బస చేస్తారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ తిమ్మరాజు పల్లె గ్రామం, 49వ బూత్ నెంబరు పరిధిలో ఆయన నిర్మించుకున్న స్వగృహం ఉంది. ఇందువల్ల ఇంటింటికీ మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఇక్కటినుంచే ప్రారంభించనున్నారు. తిమ్మరాజు పల్లె గ్రామంలోని 49వ బూత్ నెంబరు పరిధిలో మొత్తం 1309 మంది ఓటర్లున్నారు. ఇంటింటికీ మంచి ప్రభత్వం కార్యక్రమంలో భాగంగా 2వ తేదీ ఉదయం వీరిలో కొంతమంది ఇళ్లకు ఆయన వెళ్లి, కుటుంబ సభ్యులను పలకరించి, వారి సాదకబాదకాలు అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి వివరిస్తారు. ఎవరికైనా సమస్యలుంటే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తారు.తర్వాత తుమ్మిశి మోడల్ స్కూల్ ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం చేరుకుంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ చేస్తారు. వివిధ శాఖల ద్వారా వివిధ పథకాలకోసం బ్యాంకులు మంజూరు చేసిన సబ్సిడీ రుణాలకు సబంధించిన చెక్కులు పంపిణీ చేస్తారు. ఏస్ ఇండస్ట్రీస్, ఈ రాయిస్, ఎస్వీఎఫ్ సోయా బీన్స్ అనే కంపెనీలతో కడా తరఫున ఎంవోయూలు కుదుర్చుకుంటారు. వీటిలో ఏస్ ఇండస్ట్రీస్ అనేది పాల ద్వారా మెడిసన్‌కు సంబంధించిన ఉత్పత్తుల కంపెనీ కాగా, ఎస్వీఎఫ్ సోయా బీన్స్ అనేది సోయా గింజల ద్వారా ఆహార ఉత్పత్తుల కంపెనీ. ఇక ఈ రాయిస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కంపెనీ. ఈ కంపెనీ ద్వారా 130 ఎలక్ట్రిక్ ఆటోలను ముఖ్యమంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ప్రత్యేక ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు, సబ్సిడీ మీద అందిస్తున్న ఎలక్ట్రిక్ సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. అలాగే కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రభుత్వ భాగస్వామ్యంతో టాటా కన్సల్టెన్సీ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వ్ సెంటర్ (డీఐఎన్‌సీ)ను ప్రారంభిస్తారు.సాయంత్రం తుమ్మిశి పంచాయతీ డుంకుమానుపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని తిరుగు ప్రయాణమవుతారు.
అధికార వర్గాల హడావుడి
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రెండుమూడు రోజులుగా కుప్పంలో జిల్లా, స్థానిక అధికారుల హడావుడి ఎక్కువైంది. ఆదివారం సైతం కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్, ఆర్డీవో శ్రీనివాసరాజు ఇతర స్థానిక అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు. తుమ్మిశి మోడల్ స్కూల్లో నిర్మాణమవుతున్న సభా వేదిక వద్దకు వెళ్లి సూచనలు చేశారు. ఇంటింటికీ మంచి ప్రభుత్వం ప్రారంభించనున్న తిమ్మరాజు పల్లెలో కూడా కలెక్టర్ పరిశీలన సాగింది. ఇక్కడ వీధులన్నీ పరిశుభ్రమవుతున్నాయి. గ్రామం అద్దంలా మెరుస్తోంది. పాడైపోయిన వీధి లైట్లను తొలగించి, ఆ స్థానంలో కొత్త లైట్లను బిగిస్తున్నారు. కాలువలు బాగు చేస్తున్నారు. రోడ్లను పూడుస్తున్నారు. సీఎం ఇంటినుంచి బైపాస్ కూడలికి వచ్చి, తిమ్మరాజు పల్లెకు వెళ్లే తారు రోడ్డులో సైతం కొన్ని మరమ్మతులు చేశారు. పరిశుభ్రంగా ఉంచారు. పథకాల అమలు, ప్రయోజకాల పంపిణీ, కంపెనీల ఎంఓయూలకు సంబంధించిన అన్నిరకాల రికార్డులను, అవసరమైన సరంజామా సిద్ధం చేస్తున్నారు.