Share News

CM Chandrababu Naidu : విమానాశ్రయాలకు తెలుగుదనం

ABN , Publish Date - Jan 04 , 2025 | 03:44 AM

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను, కొత్తగా కట్టేవాటినీ, ప్రతిపాదన దశలో ఉన్నవాటినీ తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

CM Chandrababu Naidu : విమానాశ్రయాలకు తెలుగుదనం

  • సాంస్కృతిక చిహ్నాలతో సొబగులు

  • గన్నవరం, భోగాపురంలలో కూచిపూడి నృత్య ఆకృతులు

  • బెజవాడ ఎయిర్‌పోర్టులో అమరావతి థీమ్‌ సైతం

  • సంప్రదాయం ఉట్టిపడేలా డిజైన్ల తయారీ

  • జూన్‌ నాటికి గన్నవరం విస్తరణ పూర్తి కావాలి

  • 2026 జూన్‌నాటికి భోగాపురం అందుబాటులోకి..

  • కొత్తగా మరో ఏడు విమానాశ్రయాల నిర్మాణం

  • ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను, కొత్తగా కట్టేవాటినీ, ప్రతిపాదన దశలో ఉన్నవాటినీ తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన ప్రయాణికులకు అడుగడుగునా సంప్రదాయం కళ్లకు కట్టాలని సూచించారు. ఆ విధంగా డిజైన్లు సిద్ధంచేయాలని సూచించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో కూచిపూడి నృత్య ఆకృతులు, అమరావతి థీమ్‌ ఉండేలా ఆకృతులు ఉండాలన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని విమానాశ్రయాలపై పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మౌలిక సదుపాయాలు, రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, రాష్ట్ర ఏవియేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ‘‘రాష్ట్ర రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా గన్నవరం విమానాశ్రయాన్ని తయారుచేయాలి. ఈ ఏడాది జూన్‌ నాటికి విస్తరణ పనులన్నీ పూర్తికావాలి. ఈ విమానాశ్రయంలోకి బయట నుంచి వచ్చినవారికైనా, గన్నవరం నుంచి వెళ్తున్నవారికైనా రాష్ట్ర నృత్య సంప్రదాయం కళ్లకు కట్టినట్టు కనిపించాలి. భోగాపురం విమానాశ్రయం పనులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. ఈ విమానాశ్రయంలోకి ప్రవేశించగానే కూచిపూడి నృత్యభంగిమలతో కూడిన చిత్రాలూ .. ఆకృతులూ కనిపించేలా అందంగా ముస్తాబు చేయాలి’’ అని సీఎం నిర్దేశించారు. కాగా, గన్నవరం .. భోగాపురంతోపాటు... దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్‌, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు.. ఇలా ఏడు చోట్ల కొత్తగా చేపడుతున్న విమానాశ్రయాలపైనా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూమి విషయంలో స్పష్టతను ఇచ్చేలా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు దీనిపై పని చేయాలని చంద్రబాబు కోరారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళంలో ప్రీఫీజబిలిటీ పూర్తయిందని అధికారులు వివరించారు.

Untitled-4 copy.jpg


  • ఏడు... అడుగులు

  1. కుప్పంలో ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని ఎయిర్‌పోర్టు అఽథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సందర్శించింది. ఫీజిబిలిటీ (సాధ్యాసాధ్యాలు) నివేదికను అందించింది. దీనిపై అఽథారిటీ నుంచి ఎన్‌ఓసీ రావాల్సి ఉంది. అవసరమైన 1,250 ఎకరాల భూమిని ఏఏఐ గుర్తించింది. ఆ భూమిని కలెక్టరు అప్పగించారు. తొలిదశలో 483 ఎకరాలను రన్‌వే కోసం అందించారు. రెండోదశలో 567 ఎకరాలను భవన నిర్మాణాల కోసం సిద్ధం చేశారు.

  2. శ్రీకాకుళం విమానాశ్రయం కోసం 1,383.71 ఎకరాలను సమీకరించాలని నిర్ణయించారు. రన్‌వే కోసం 480.46 ఎకరాలు, విమానాశ్రయం కోసం 525 ఎకరాలు ప్రాథమికంగా సేకరించాలని భావించారు.

  3. దగదర్తి విమానాశ్రయ నిర్మాణాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించింది. 1,379 ఎకరాల్లో నిర్మించాలని అ ప్పట్లో కార్యాచరణను రూపొందించారు. అందులో 635 ఎకరాల కోసం భూసేకరణను తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే చేపట్టింది. మరో 745 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ విమానాశ్రయానికి అనుమతులన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతంలో బీపీసీఎల్‌ రిఫైనరీ వస్తోంది. వీటికితోడు ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందనుంది. దీన్నిదృష్టిలో ఉంచుకుని శ్రీసిటీ సెజ్‌లో ఎయిర్‌ స్ట్రిప్‌ను కూడా తేవాలన్న యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు.

  4. ఒంగోలు ఎయిర్‌పోర్టు కోసం 657 ఎకరాలను గుర్తించారు. దీనిపై ఫీజిబిలిటీని అధ్యయనం చేయాల్సి ఉంది.


5.నాగార్జునసాగర్‌ వద్ద 1,570 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ 500ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకు అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి.

6.తాడేపల్లి గూడెం ఎయిర్‌పోర్టును 1,123 ఎకరాల్లో నిర్మాణం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. దీనికి సమీపంలో అటు రాజమండ్రి, ఇటు గన్నవరం ఉన్నాయి. దీంతో ఇక్కడ ఫీజిబిలిటీ సమస్యగా మారింది.

7.అన్నవరం-తుని మఽధ్య ఎయిర్‌పోర్టును నిర్మించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ రైల్వేలైన్‌, జల వనరులు ఉన్నాయని అధికారులు చెప్పారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు వచ్చే వీలుంది. నక్కపల్లిలో స్టీల్‌ప్లాంట్‌, సిటీ విస్తరణ జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు పెడితే అనుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తంచేశారు. అనకాపల్లి, కాకినాడ, విశాఖలకు దగ్గరలో ఎయిర్‌పోర్టు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jan 04 , 2025 | 03:44 AM