Share News

Chandrababu Naidu: మీకోసం నేనున్నా

ABN , Publish Date - Apr 27 , 2025 | 03:07 AM

శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మత్స్యకారులకు రూ.259 కోట్లు జమ చేశారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక పథకాలు ప్రకటించారు

Chandrababu Naidu: మీకోసం నేనున్నా

మత్స్యకారులకు సీఎం భరోసా

  • జీవితాల్లో వెలుగులు తెస్తానని హామీ

  • శ్రీకాకుళంలో ‘మత్స్యకారుల సేవలో’ ప్రారంభం

  • 1,29,578 మంది లబ్ధిదారులకు 259 కోట్లు

  • ఒక్కొక్కరి ఖాతాలో రూ.20 వేలు జమ

  • జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రణాళికలు

  • 550 మత్స్యకార గ్రామాల దశ, దిశ మారుస్తా

  • మీ కష్టాలను తెలుసుకునేందుకే వచ్చా

  • వైసీపీ ప్రభుత్వం ఒక్కరినీ బాగుచేయలేదు

  • పచ్చటి చెట్లు నరకడం.. పరదాలు కట్టడమే

  • బుడగట్లపాలెం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ రోజు మత్స్యకారుల ఖాతాల్లో రూ.259 కోట్లు వేశాను. నేనూ బటన్‌ నొక్కవచ్చు. కానీ మీ కష్టాలను తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాను. గత పాలకులు ఇలా పర్యటనకు వచ్చి ఉంటే.. మీ ప్రాంతంలోని కొబ్బరిచెట్లు గోవిందా. చెట్లను నరికేయడం, పరదాలు కట్టేయడం, ఇళ్లల్లో నుంచి బయటకు రానీయకుండా చేయడమే వారి పని. 2014-19లో మత్స్యకారుల కోసం రూ.725 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు ఏడాదికి రూ.259 కోట్లు ఇస్తున్నాం. మీ పిల్లలను బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఆరు రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 69 వేలమంది మత్స్యకారులు పింఛన్లు పొందుతున్నారు. లీటర్‌ డీజిల్‌కు రూ.9 రాయితీ ఇస్తున్నాం. రాష్ట్రంలో 23,062 బోట్లకు ఏడాదికి రూ.50 కోట్లు ఇస్తున్నాం. బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ను ఏడాదిలో పూర్తి చేసి అందజేస్తాం.

- సీఎం చంద్రబాబు


శ్రీకాకుళం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేట విరామం సందర్భంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 1,29,578 మంది మత్స్యకార లబ్ధిదారుల ఖాతాల్లో రూ.259 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మత్స్యకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ‘సముద్రంతో పాటుగా వంశధార, నాగావళి నదులు, గనులు, బంగారం పండే భూములు ఉన్నాయి. ఇక్కడ నిరంతరం నీళ్లు వస్తాయి. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేంత వరకు ఇక్కడికి వస్తూనే ఉంటాను. సమాజంలో అట్టడుగున ఉండే వర్గాల్లో మత్స్యకారులు ఒకరు. సముద్రాన్నే నమ్ముకున్నారు. సముద్రంలో వేటకు వెళ్తేనే మీ కడుపు నిండుతుంది. సముద్రంలో చేపల అభివృద్ధి కోసం రెండు మాసాల పాటు వేట నిషేధం అమల్లో ఉంది. 2014-2015లో వేట విరామ సమయంలో ఆర్థిక సహకారం అందించింది మేమే. ఆ తర్వాత వైసీపీ వచ్చి రూ.10 వేలు ఇచ్చింది. ఫిష్‌ ఆంధ్ర అన్నారు. రూ.300 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి, ఏ ఒక్కరినీ బాగు చేయలేదు. వైసీపీ హయాంలో ఐదేళ్లు అభివృద్ధి ఆగిపోయింది. పరిశ్రమలు పారిపోయాయి. సంక్షేమం నిలిచిపోయింది. ప్రజల సంపద ఆగిపోయింది. టీడీపీ ప్రభుత్వముంటే అదనంగా ఏడు లక్షల కోట్ల సంపద పెరిగేది. ప్రతి ఇంటికి అదనంగా రూ.50 వేల నుంచి రూ.70 వేలు పెరిగేది. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయం పెంచాలి. జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. 2029 నాటికి జీరో పావర్టీ అనేదే లక్ష్యం’ అని చంద్రబాబు అన్నారు.


నాడు ఎర్రన్న.. నేడు తనయుడు

‘2014-19లో భోగాపురం ఎయిర్‌పోర్టుకు నేనే శ్రీకారం చుట్టాను. ఆ తర్వాత అధికారంలో నేనుంటే పూర్తయ్యేది. వైసీపీ వాళ్లు వచ్చాక మార్పు చేశారు. ఇప్పుడు నేను పూర్తి చేస్తాను. ఒకప్పుడు కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా ఉండి ఉద్దానానికి నీటిని తీసుకువచ్చారు. ఇప్పుడు ఎర్రన్న తనయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తికానుంది. కేబినెట్‌ మంత్రిగా రామ్మోహన్‌నాయుడుకు అవకాశం ఇచ్చాను. నేను ఢిల్లీకి వెళ్తే.. ఆయన ఎంతో బాగా పనిచేస్తున్నారని అక్కడ చాలామంది కొనియాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందకపోతే రామ్మోహన్‌నాయుడి ‘డిగ్రీ’ వాపస్‌ ఇవ్వాల్సిందేనని హెచ్చరించా(నవ్వుతూ). ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఇటీవలే మంచి డ్రామా ప్రదర్శించారు. ఆయనలో ఇంత టాలెంట్‌ ఉందా అని ఆశ్చర్యంగా ఉంది. చాలా సమస్యలను పూస గుచ్చినట్లుగా చెప్పగలిగారు. ఇటువంటి టీమ్‌ ఉన్నప్పుడు జిల్లా ఎందుకు అభివృద్ధి కాలేదని ప్రశ్నిస్తున్నా. మనమందరం అనుకుంటే ఏదైనా సాధ్యం’ అని చంద్రబాబు అన్నారు.


WSAD.jpg

మత్స్యకారులకు మంచి భవిష్యత్తు

‘స్థానిక మత్స్యకార ఆడబిడ్డలను అడుగుతున్నా.. జీవితాంతం తరతరాల వారసత్వం మాదిరిగా పేదరికంలోనే బతకాలా? ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకుని ముందుకు వెళ్లాలి. రాష్ట్రంలో 550 మత్స్యకారుల గ్రామాల దశదిశ మార్చాలి. దేశంలో 25 శాతం రాష్ట్రం నుంచే చేపలు ఉత్పత్తి జరుగుతోంది. 32 శాతం ఎగుమతి అవుతోంది. దీనివల్ల 16 లక్షలా 52 వేల మందికి ఉపాధి లభిస్తోంది. మత్స్యకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఒకప్పుడు వరి ధాన్యం తినేవాళ్లం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదు. మనుషుల్లో తెలివితేటలు పెరగాలన్నా, మైండ్‌ బాగా పెరగాలన్నా చేపలు తినాలి. గుండెపోటు, బీపీ, షుగర్‌ రావు’ అని అన్నారు.


పీ4తో సమాజం మార్పు

‘మార్గదర్శకులు, బంగారు కుటుంబాలు అనే కాన్సె‌ప్ట్‌తో పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సమాజం నుంచి బాగుపడినవారు మళ్లీ సమాజానికి కొంత ఇచ్చేయాలి. వారి ద్వారా పేదల జీవన ప్రమాణాలు మరింత మెరుగవ్వాలి. రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. వీళ్లు 20, 30 లక్షల పేద కుటుంబాలను దత్తత తీసుకుని బాగుచేసి, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నది నా లక్ష్యం. అట్టడుగున ఉన్నవారిని పైకి తీసుకురావాలి. ఇదే మార్గదర్శి-బంగారు కుటుంబం లక్ష్యం. ఏదో మొక్కుబడిగా కాకుండా నేను నిరంతరం ఆన్‌లైన్‌లో పరిశీలిస్తాను. ఇటు సూపర్‌ సిక్స్‌ పథకాలు కూడా ప్రజలకు అందజేస్తాం. ఇప్పటికే 200 అన్నక్యాంటీన్లు పెట్టాం. పేదలకు పింఛన్లు ఇస్తున్నాం. దీపం 2 కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మత్స్యకారులకు రూ.20 వేల చొప్పున అకౌంట్‌లో వేశాం. కేంద్ర ప్రభుత్వంతో కలసి అన్నదాతలకు మూడు విడతల్లో రూ.20 వేలు ఇస్తాం. జూన్‌ నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. గత ఐదేళ్లు ఒక డీఎస్సీ కూడా నిర్వహించలేదు. ఒక టీచర్‌ పోస్టును కూడా నియమించలేదు. 17 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, జూన్‌లో స్కూళ్లను తెరిచేందుకు చర్యలు తీసుకున్నాం’ అని చంద్రబాబు వివరించారు.


ఇక్కడే ఉద్యోగావకాశాలు

‘స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోనే ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటాం. ఆనాడు ఎన్టీఆర్‌ రూ.30 పింఛన్‌ ఇవ్వగా.. నేను రూ.75 చేశాను. ఆ తర్వాత రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలు చేశాం. కిడ్నీ రోగులకు, పేదలకు పింఛన్‌ ఇస్తున్నాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు పరిహారం కింద రూ.10 లక్షలు ఇస్తున్నాం. ఒకప్పుడు సెల్‌ఫోన్‌ ఉండేది కాదు. 1995-2000లో సెల్‌ఫోన్‌ను నేనే ప్రమోట్‌ చేశాను. ఇప్పుడు సెల్‌ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారింది. వాట్సాప్‌ గవర్నెన్స్‌లో వెయ్యి సర్వీసులు అమలు చేస్తున్నాం. 270 సర్వీసులు ఇప్పుడు ఇస్తున్నాం. మిగిలినవి కూడా అమల్లోకి తెస్తాం’ అని అన్నారు. మొదట సీఎం చంద్రబాబు బుడగట్లపాలెంలో అమరావతి ఆలయాన్ని సందర్శించారు.


పశుసంపదను అభివృద్ధి చేద్దాం!

  • పశు సంరక్షణకు అంకితమైన అందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు

‘పశు ఆరోగ్యం ఒక బృందం’ అనే స్పూర్తితో మన పశు సంపదను అభివృద్ధి చేద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ పశువుల వైద్య దినోత్సవం సందర్భంగా సీఎం సందేశం ఇచ్చారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి మానవాళికి అవసరమైన ముఖ్య ఆహార పదార్థాల్లో పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తుల్లో మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచడానికి కృషి చేస్తున్నామన్నారు. పాడి ఉత్పత్తుల ప్రాముఖ్యతను, వాటి నాణ్యతను పెంచడానికి అమలు చేయగల ఆధునిక సాంకేతికతలను గుర్తించాలని చంద్రబాబు కోరారు.


Also Read:

వీళ్లు వేడి నీళ్లు తాగకూడదు..

విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 27 , 2025 | 05:26 AM