Share News

Fishermen Financial Aid: గంగపుత్రులకు డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:53 AM

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు డబుల్ ధమాకా అందిస్తోంది. వేట నిషేధ కాలంలో లబ్ధి పొందే మత్స్యకారులకు ఇప్పుడు రూ.20,000 చొప్పున భృతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు

 Fishermen Financial Aid: గంగపుత్రులకు డబుల్‌ ధమాకా

  • వేట నిషేధ కాలంలో రెట్టింపు భృతి

  • గత ప్రభుత్వం ఇచ్చింది రూ.10 వేలు

  • 20 వేలు ఇస్తామన్న చంద్రబాబు

  • మంత్రి అచ్చెన్న ఆదేశాలతో రీ సర్వే

  • అర్హులను గుర్తించిన మత్స్య శాఖ

  • 1,22,968 మంది జాలర్లకు లబ్ధి

  • 26న సొమ్ము విడుదల చేయనున్న సీఎం

  • మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక దన్ను

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత్స్యకారులకు త్వరలోనే సర్కారు చేయూతనందించనుంది. వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకుండా వారికి ఆర్థిక సాయం చేయనుంది. దీనికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మత్స్యకారులకు వేట నిషేధ భృతిని ప్రస్తుత ప్రభుత్వం రూ.20 వేలు చొప్పున ఇవ్వనుంది. గత ప్రభుత్వం మత్స్యకార భరోసా పేరుతో రూ.10 వేలు చొప్పున ఇవ్వగా, దీనిని రూ.20 వేలకు పెంచుతామని గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు వాస్తవ లబ్ధిదారులకు సంతృప్త స్థాయిలో భృతి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యశాఖ తాజాగా గుర్తించిన అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల 26న సీఎం చంద్రబాబు మత్స్యకార భృతిని వారి వారి బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో జమ చేయనున్నారు. అయితే, గత ప్రభుత్వం 2024, మే నెలలో 12 ఉమ్మడి జిల్లాల్లోని 1,30,128 మంది జాలర్లలో 24,741 మందిని అనర్హులుగా, 1,05,387 మందిని అర్హులుగా గుర్తించింది. కానీ, గత జూన్‌లో ప్రభుత్వం మారిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై సమీక్షించారు.


మత్స్యకార భరోసాలో అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులు లబ్ధి పొందారని ఫిర్యాదులు రావడంతో వాస్తవ లబ్ధిదారులను గుర్తించడానికి మంత్రి రీసర్వే చేయించారు. చేపల వేట కోసం మత్స్యకారుల బోట్లుకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే డీజిల్‌ను తక్కువగా వినియోగించుకున్న వారు వేటకు వెళ్లడం లేదనే సాకుతో 16,213 మందిని మత్స్యకార భరోసాకు అనర్హులుగా గత ప్రభుత్వం ప్రకటించిన విషయం వెలుగులోకి వచ్చింది. నిజంగా వేటకు వెళ్లే వారందరికి లబ్ధి అందించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రీసర్వే తర్వాత తుది జాబితా ప్రకారం 1,30,227 మంది జాలర్లలో 1,22,968 మందిని అర్హులుగా, 7,259 మందిని అనర్హులుగా మత్స్యశాఖ నిర్ధారించింది.


ఇదీ మత్స్యకార భృతి నేపథ్యం

ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజుల పాటు తూర్పు తీర సముద్ర జలాల్లో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తుంది. సముద్ర మత్స్య సంపదను పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర జాతుల సంతానోత్పత్తికి వేట నిషేధం దోహదపడుతుంది. అయితే, వేట నిషేధం వల్ల జీవన భృతిని కోల్పోతున్న మత్స్యకారులకు ఉపశమనం కోసం 2013 వరకు 31 కిలోల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేసేది. 2014, 15లో బియ్యం బదులు రూ.2 వేల నగదు అందజేయగా, 2016 నుంచి అప్పటి టీడీపీ ప్రభుత్వం భృతిని రూ.4 వేలకు పెంచింది. 2019 నుంచి రూ.10 వేలు పెంచినా డీజిల్‌ సబ్సిడీ తక్కువగా వాడుకున్న మత్స్యకారులు వేటకు వెళ్లడం లేదనే సాకుతో మత్స్యకార భరోసాకు వేల మందిని అనర్హులుగా జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తక్కువ మందికే సాయం అందింది. 2019-20లో 1,02,478 మంది అర్హులుగా ఉండగా, 2021-22లో 97,619 మందికే సాయం చేసింది. 2023-24లో 1,16,613 మందికి భరోసా ఇచ్చినా.. అనేక మంది అర్హులు లబ్ధి పొందలేదు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు సంతృప్త స్థాయిలో సర్వే చేయించి, 1,22,968 మంది అర్హులతో లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయించారు. వీరికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.

నాడు-నేడు తేడా ఇదే!

వైసీపీ హయాంలో అనర్హులు: 24,741

జగన్‌ పాలనలో అర్హుల సంఖ్య: 1,05,387

చంద్రబాబు హయాంలో అనర్హులు: 7,259

ప్రస్తుతం లబ్ధి పొందే మత్య్సకారులు: 1,22,968

అదనంగా లబ్ధి పొందేవారు జాలర్లు: 17,581


Read Also: Career Tips: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంచుకునేందుకు అదిరిపోయే టిప్స్

ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ముసలోళ్లు అప్లై చెయ్యెచ్చు

Updated Date - Apr 17 , 2025 | 04:53 AM