Central Government : ప్రజలందరికీ పింఛను!
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:57 AM
దేశంలోని ప్రజలు అందరికీ కొత్త పింఛను పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

‘కొత్త పెన్షన్ స్కీమ్’పై కేంద్రం కసరత్తు
60 ఏళ్లు దాటిన వారందరికీ వర్తింపు!
ఈపీఎఫ్‌వో ఆధ్వర్యంలో నిబంధనల రూపకల్పన.. త్వరలో అభిప్రాయ సేకరణ
‘కొత్త పెన్షన్ స్కీమ్’ అమలుకు కేంద్రం సన్నాహాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశంలోని ప్రజలు అందరికీ కొత్త పింఛను పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అసంఘటిత రంగంలోని వారితో సహా పౌరులందరికీ ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో సార్వత్రిక పింఛను పథకంపై కేంద్రం కసరత్తు చేస్తోందని కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అసంఘటిత రంగానికి చెందిన నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే పెద్ద పొదుపు పథకాలేవీ లేవు. ఇప్పటికే అమలులో ఉన్న ఈపీఎ్‌ఫవో వంటి పథకాల్లో ఉద్యోగులు, వారు పనిచేసే సంస్థ నుంచే కంట్రిబ్యూషన్లు జమవుతాయి, వీటిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి వాటా జమ కాదు. పెట్టుబడిదారుడికి 60ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1000 నుంచి 1,500 రాబడిని అందించే అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారులు, గృహనిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్‌ధన్ యోజన (పీఎం-ఎ్‌సఐఎం) తో పాటు 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3వేలు అందించే ప్రధాన మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన వంటి పథకాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. వీటికి కొంత మొత్తం ప్రజలు చెల్లిస్తుండగా, మరికొంత ప్రభుత్వం భరిస్తోంది. భారత్‌లో 2036 నాటికి సీనియర్ సిటిజన్ల జనాభా 22.7 కోట్లకు చేరుతుందని అంచనా. ఇది మొత్తం దేశ జనాభాలో 15శాతం.
2050 నాటికి వీరి సంఖ్య దేశ జనాభాలో 20 శాతానికి అంటే 34.7 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. అమెరికా, కెనడా, యూరప్, రష్యా, చైనా తదితర దేశాలు ఇప్పటికే పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ, నిరుద్యోగ ప్రయోజనాలను కవర్ చేసే సామాజిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. ఇక డెన్మార్క్, నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు ఇప్పటికే సార్వత్రిక పెన్షన్ పథకాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోనూ సామాజిక భద్రతను విస్తరించే లక్ష్యంతో 60 ఏళ్లు దాటిన వారందిరికీ ఒకే పింఛను పథకం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పొదుపు/ పింఛను పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త కార్యక్రమాన్ని అమలు చేసే అవకాశం ఉందని కార్మిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగం చేస్తున్న వేతన జీవులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా కొత్త విధానం వర్తించేందుకు వీలుగా ఈపీఎఫ్‌వో ఆధ్వర్యంలో విధివిధానాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ‘న్యూ పెన్షన్ స్కీం’ అని పిలిచే ఈ కొత్త పథకం ఇప్పటికే అమలులో ఉన్న ఎన్‌పీఎస్ స్థానాన్ని భర్తీ గానీ, విలీనం గానీ చేయబోదని ఆ వర్గాలు వివరించాయి.