BC Communities: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు పునర్వైభవం
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:00 AM
గత పాలకులు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బీసీలకు తగిన ప్రాతినిథ్యం దక్కుతోంది. ఈ ప్రభుత్వంలోనే బీసీలకు పునర్వైభవం వచ్చింది అని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత పేర్కొన్నారు

బీసీ ఆత్మగౌరవ భరోసా సభలో మంత్రులు అనగాని, సత్యకుమార్, సవిత
తిరుపతి (ఉపాధ్యాయనగర్), జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘గత పాలకులు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బీసీలకు తగిన ప్రాతినిథ్యం దక్కుతోంది. ఈ ప్రభుత్వంలోనే బీసీలకు పునర్వైభవం వచ్చింది’ అని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత పేర్కొన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం, అంబేడ్కర్- పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో జరిగిన ‘బీసీ ఆత్మగౌరవ భరోసా’ సభలో వీరు మాట్లాడారు. రాష్ట్రంలో 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తే అందులో 29.7 లక్షల మంది బీసీలు, 11 లక్షల మంది ఎస్సీలు ఉన్నారని మంత్రి అనగాని అన్నారు. మైనారిటీలతో కలుపుకొని 53 లక్షలమంది వెనుకబడిన తరగతులవారు ఉన్నారని వివరించారు. చంద్రబాబు అడిగినందువల్లే ప్రధాని మోదీ దేశంలో కులగణన చేపట్టనున్నారన్నారు. మనం పోరాటం చేయాల్సిన అవసరం లేకుండానే కూటమి ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తోందని చెప్పారు. ‘అధికారంలో ఉన్నన్నాళ్లు బీసీల బాగోగులు పట్టించుకోలేదు. దౌర్జన్యాలు, దాడులు చేశారు. 15 సంవత్సరాల అమర్‌నాథ్‌గౌడ్‌ను నడిరోడ్డుమీద పెట్రోలుపోసి తగులబెట్టారు. అలాంటి వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీసీలకు న్యాయం చేస్తామంటున్నారు’ అం టూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైసీపీపై ధ్వజమెత్తారు. ‘తన మంత్రివర్గంలో సమర్థులనే కొనసాగించి మిగిలినివారిని తీసేస్తానన్న జగన్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మార్చలేదుగానీ పక్కజిల్లాలోని అనిల్‌కుమార్ యాదవ్‌ను మార్చారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని మార్చలేదుగానీ బోయ కులానికి చెందిన బొమ్మన జయరామ్‌ను మార్చారు. పార్థసారధిని మార్చి.. తన కులానికి చెందినవారిని మార్చలేదు’ అని గుర్తుచేశారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాతే అన్ని రంగాల్లో బీసీలు ముందున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపా రు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయావ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.