Share News

AP Govt : సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్‌ రద్దు

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:48 AM

ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయడం తదితర ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది.

AP Govt : సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్‌ రద్దు

  • అడ్మిషన్‌ వద్దంటే కట్టిన ఫీజు వెనక్కివ్వాలి

  • ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కీలక ఆదేశాలు

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయడం తదితర ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాలేజీలకు హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.మధుమూర్తి మంగళవారం కీలక ప్రకటన జారీ చేశారు. అదనపు ఫీజులు వపూలు చేయడం, రీయింబర్స్‌మెంట్‌ వర్తించే విద్యార్థులను ఫీజులు డిమాండ్‌ చేయడం వర్సిటీలు, ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటువంటి విద్యాసంస్థల అఫిలియేషన్‌ రద్దుచేసి, న్యాయపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

కాలేజీలు పాటించాల్సిన నిబంధనలివీ...

అడ్మిషన్‌ తీసుకున్న తర్వాత విద్యార్థి అడ్మిషన్‌ వద్దనుకుంటే మొత్తం ఫీజులో 5శాతం (గరిష్ఠంగా రూ.5వేలు దాటకూడదు) మించకుండా మినహాయించుకుని 15 రోజుల్లోగా వారు కట్టిన ఫీజులు వెనక్కి చెల్లించాలి. రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులను ఫీజులు చెల్లించాలని అడగటం నిషేధం. అడ్మిషన్‌ సమయంలో విద్యార్థుల నుంచి మార్కుల షీట్లు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోకూడదు. వ్యక్తిగతంగా నిర్ధారించి రాసిచ్చిన కాపీలు మాత్రమే తీసుకోవాలి. ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలించి, తిరిగి ఇచ్చేయాలి. ఏమైనా అనుమానాలుంటే వాటిని జారీచేసిన అథారిటీ ద్వారా ధ్రువీకరించుకోవాలి. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఖరారు చేసిన ఫీజు కంటే అదనంగా వసూలు చేయకూడదు.

Updated Date - Jan 08 , 2025 | 05:48 AM