Airbus : ఏపీకి ‘ఎయిర్‌బస్ హెలికాప్టర్’!?
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:04 AM
రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్ బస్’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది.

హెచ్125 హెలికాప్టర్ల ప్లాంటు ఏర్పాటు యోచన
4 రాష్ట్రాలను ఎంచుకున్న ఎయిర్‌బస్
అందులో ఏపీ వైపే ఎక్కువ మొగ్గు
అన్నీ కుదిరితే అనంతపురం జిల్లాలో ఏర్పాటు
అమరావతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్ బస్’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది. భారత్‌లో హెలికాప్టర్ల ఉత్పత్తి ప్రారంభించాలని ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఇప్పటికే నిర్ణయించుకుంది. ఇందుకు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలిస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాలతో ఎయిర్ బస్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో... ఏపీ వైపే ఎయిర్‌బస్ మొగ్గు చూపే అవకాశముందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ‘కియా’తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అనంతపురం జిల్లాలోనే హెచ్125 హెలికాప్టర్ల యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశముందని చెబుతున్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిగాయని... అనంతపురంలో అనువైన భూమిని కేటాయించాలంటూ జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు అందాయని వార్తలు వస్తున్నాయి.
ఇదీ హెచ్125 హెలికాప్టర్...
ఫ్రాన్స్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక విమాన కంపెనీ ‘ఎయిర్ బస్’ హెచ్125 హెలికాప్టర్లను తయారు చేస్తోంది. ఇది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్. గరిష్ఠంగా ఆరుగురు ప్రయాణించగలరు. పర్యాటకం, సరిహద్దుల్లో పహారా, విపత్తు సమయంలో సహాయ చర్యల్లో చక్కగా వినియోగించవచ్చు. దీని గరిష్ఠ వేగం గంటకు 289 కిలోమీటర్లు. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న హెలికాప్టర్ ఇదే. భారత్‌లో హెలికాప్టర్ల మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని... ‘మేడిన్ ఇండియా హెచ్125 హెలికాప్టర్’ తయారు చేయాలని యోచిస్తున్నట్లు ‘ఎయిర్‌బస్’ ఇదివరకే ప్రకటించింది.