Tirumala: ఏఐతో గంటలో శ్రీవారి దర్శనం అసాధ్యం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం
ABN , Publish Date - Aug 03 , 2025 | 10:14 AM
సామాన్య భక్తులు కేవలం గంట వ్యవధిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటలో శ్రీవారి దర్శనం అసాధ్యమని..

తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనం వేగంగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన కామెంట్స్ చేశారు. దర్శనంలో ఏఐ వినియోగాన్ని ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం, టీటీడీ చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టారు. సామాన్యులు కేవలం గంట వ్యవధిలో తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడం అసాధ్యమని తెలిపారు. ప్రస్తుత విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసేందుకు అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. AI పేరుతో టీటీడీ ధనాన్ని వృథా చేయడం మంచిది కాదని సూచించారు.
మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం తిరుమలలో ఏఐ టెక్నాలజీ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులు కేవలం గంటలోనే దర్శించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించడం అంటే టీటీడీ ధనాన్ని వృథా చేయడమేనని అన్నారు. ఆచరణ సాధ్యంకాని ఇలాంటి ప్రయత్నాలకు ప్రభుత్వ పాలకులు, టీటీడీ స్వస్తి పలకాలని హితవు పలికారు. అధిక భక్తులు.. తిరుమలలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు త్వరిత దర్శనానికి సహకరించవని స్పష్టం చేశారు. ఇందుకు బదులుగా తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
మీ సహకారానికి కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్
రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకుంటాం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి