పెరుగుతున్న కే సిరీస్ ట్రెండ్.. సినిమాలతోపాటు..
ABN , Publish Date - Aug 03 , 2025 | 10:53 AM
ప్రపంచమంతా ‘కె’ చుట్టూ పరిభ్రమిస్తోంది. కె సిరీస్, కె సినిమా, కె మ్యూజిక్, కె రుచులు, కె ఫ్యాషన్లు... ఇంకా కె బ్యూటీ. ‘కె’ అంటే కొరియన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన యువతరం ‘కొరియన్’ ఫ్యాషన్లనే కాదు... బ్యూటీ ట్రెండ్స్‌నూ గట్టిగా ఫాలో అవుతోంది.

- ‘కె’ బ్యూటీ మానియా
ప్రపంచమంతా ‘కె’ చుట్టూ పరిభ్రమిస్తోంది. కె సిరీస్, కె సినిమా, కె మ్యూజిక్, కె రుచులు, కె ఫ్యాషన్లు... ఇంకా కె బ్యూటీ. ‘కె’ అంటే కొరియన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన యువతరం ‘కొరియన్’ ఫ్యాషన్లనే కాదు... బ్యూటీ ట్రెండ్స్‌నూ గట్టిగా ఫాలో అవుతోంది. అందుకే నగరాల్లో కొరియన్ బ్యూటీ షాపులూ కనిపిస్తున్నాయి. అసలీ ‘కె’ బ్యూటీ ప్రపంచంలో ఏముంది?
ఓటీటీల పుణ్యమా అని ‘కె’ సిరీస్‌లు, సినిమాలు పరిచయం అయ్యాయి. దక్షిణ కొరియా సినిమాల్లో ఏ హీరోని, ఏ హీరోయిన్ చూసినా మంత్రముగ్ధులు కావాల్సిందే. అదేంటోగానీ వారంతా పాతికలోపు ఉన్నట్టుగానే కనిపిస్తారు. ‘వాళ్లు అమృతం తాగారా?’ అని బామ్మలు, అమ్మమ్మలూ సందేహిస్తున్నారు. ప్రస్తుతం ‘కె’ సౌందర్య ఉత్పత్తులు యువతరాన్ని తెగ ఆకర్షిస్తున్నాయి.
గాజులాంటి పారదర్శకత...
కొరియన్ల ఆహారంలో ఎక్కువగా ‘సీఫుడ్’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఆహారంతో పాటు వాళ్లు సాదా సీదా జీవనానికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ సింప్లిసిటీ అనేది వాళ్ల సౌందర్య సాధనాల్లో కూడా ప్రతిబింబిస్తుంది. అందరిలాగే వాళ్లూ మేకప్ వేసుకుంటారు కానీ అది మేకప్‌లా కనిపించదు. ఈ సహజ మేకప్‌ను ‘గ్లాస్ స్కిన్’గా పేర్కొంటారు. గాజులా పారదర్శకంగా ఉంటుందనే ఆ పేరు. గ్రీన్ టీ, టైగర్ గడ్డి, బియ్యం నీళ్లు, గుడ్డు పెంకుల్లాంటి సహజసిద్ధ పదార్థాలు వాళ్ల స్కిన్‌కేర్‌లో ముఖ్యమైనవి అంటే నమ్ముతారా? కొరియన్ సౌందర్యోత్పత్తుల్లో సహజసిద్ధమైన పదార్థాలను ఎక్కువగా వాడతారు. రసాయనాల వినియోగం తక్కువ. ఇవన్నీ చర్మం తేమను పెంచుతూ, కాంతివంతం అయ్యేలా చేస్తాయి. చర్మానికి సరైన పోషణను అందిస్తాయి. వయసు తెలియకుండా మాయ చేస్తాయి. అందుకే జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫాకు చెందిన యువతీయువకులు చాలా సీరియస్‌గా కొరియన్ బ్యూటీ ఉత్పత్తులను అనుసరిస్తున్నారు.
ఔట్‌లెట్లు పెరుగుతున్నాయి...
మనదేశంలో కొరియన్ బ్యూటీ ఉత్పత్తులు వేగంగా దూసుకుపోతున్నాయని ఇటీవల వివిధ గణాంకాలు చెబుతున్నాయి. 2021లో కె బ్యూటీ మార్కెట్ 3,200 కోట్ల రూపాయలుగా నమోదైతే... ఇది 2032 నాటికి 8,500 కోట్ల రూపాయలకి చేరుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం 39 శాతం భారతీయ మహిళలు కొరియన్ సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తున్నారని తేలింది. ‘స్నెయిల్ మ్యూసిన్, ప్రొపొలిస్, బాంబూ ఎక్స్‌ట్రాక్ట్ లాంటి పదార్థాలున్న ఉత్పత్తులు మన డ్రెస్సింగ్ రూముల్లోకి వచ్చేశాయి. చలికాలంలో మాత్రమే కోల్డ్‌క్రీమ్ రాసుకునే రోజులు ఎప్పుడో అటకెక్కాయి. ఉదయం, రాత్రి వేళల్లో 10 పాయింట్ల ‘కె బ్యూటీ’ రొటీన్‌ని ఫాలో అవుతున్న యువత సంఖ్య పెరిగింది. ఎంతో సృజనాత్మకతతో, పరిశోధనలతో చర్మానికి పోషణ చేకూర్చే పదార్థాలతో ఈ సౌందర్యోత్పత్తులను కొరియన్ సైంటిస్టులు రూపొందించడం విశేషం. అందుకే ప్రపంచమంతా వాటికి నీరాజనం పడుతోంది.
కొరియన్ సౌందర్య ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్న వినియోగదారుల్లో ఏటా 75 శాతం పెరుగుదల కనిపిస్తోందని ‘అమెజాన్’కి చెందిన ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇండియా విభాగం తెలియజేస్తోంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో ఈ కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నాయట. కొరియన్ బ్యూటీ కంపెనీ ‘అమోర్‌పసిఫిక్’ కి చెందిన ‘ఇనిస్‌ఫ్రీ’ ఔట్‌లెట్‌ని ఢిల్లీ ఖాన్ మార్కెట్‌లో పదేళ్ల క్రితమే ప్రారంభించారు. అదే మన దేశంలో తొలి కొరియన్ బ్యూటీ బ్రాండ్. అయితే కరోనా తర్వాత ఓటీటీలు ప్రజల మైండ్‌సెట్‌ను మార్చేశాయి.
అందరికీ అందుబాటులోకి వచ్చిన కొరియన్ సిరీస్‌లు, సినిమాల వల్ల అక్కడి కుర్ర స్టార్లకు అభిమానులు ఏర్పడ్డారు. వారి సౌందర్యానికి ఫిదా అయిపోయి, వారిని ఫాలో అయ్యే ట్రెండ్ మొదలయ్యింది. దాంతో ప్రస్తుతం 60కి పైగా కొరియన్ బ్యూటీ బ్రాండ్ల ఔట్‌లెట్లు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ సంఖ్య మరింత వేగంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భారత స్కిన్‌కేర్ మార్కెట్‌లో ‘కె’ ఉత్పత్తులే 15 శాతం ఆక్రమించాయి. ఇంతకు ముందు మనదేశంలో కొన్ని ప్రముఖ బాండ్ల ఔట్‌లెట్లలో వీటిని విక్రయించేవారు. రాను రాను నగరాల్లో ప్రత్యేక ఔట్‌లెట్లు వెలుస్తున్నాయి. ‘కె’ బ్యూటీ ఇంతలా విస్తరించడానికి సోషల్ మీడియా ప్రధాన కారణం. ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావంతో యువతరం వీటి వెనక పడుతోంది.
అయితే ఎప్పుడైనా, ఎక్కడైనా ఇన్‌స్టా రీల్స్ మాయలో పడి వాస్తవాల్ని విస్మరించకూడదు. మనదేశం, కొరియా వాతావరణ పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి. అలాగే చర్మ తీరుతెన్నులు కూడా భిన్నం. అందుకే కొరియాకు సంబంధించిన సౌందర్య ఉత్పత్తుల వాడకంలో వెర్రిగా ఫాలో కాకుండా, కొంత ఆలోచించి అడుగేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ యువతరం మాత్రం అక్కడి సంగీతం, సినిమా, ఫుడ్‌ను ఫాలో అవుతున్నట్టే బ్యూటీ ఉత్పత్తులను కూడా డ్రెస్సింగ్‌రూమ్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ ట్రెండ్ ఎంతకాలం సాగుతుందో వేచి చూడాల్సిందే.
ఇవీ ‘కె’ స్కిన్‌కేర్ సూత్రాలు ...
‘కె’ బ్యూటీ ప్రపంచంలో పది అంశాల స్కిన్‌కేర్ ముఖ్యమైనది. ‘ఇందులో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా రోజూ పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చ’ని అంటున్నారు కొరియన్ సౌందర్య నిపుణులు.
1) ఆయిల్ క్లీన్సర్: ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రపోయే ముందు ఆయిల్ క్లీన్సర్‌తో చర్మాన్ని శుభ్రపరచుకోవడం కె బ్యూటీలో మొదటి అడుగు. దీనికి ఎక్కువగా క్రీమ్ లేదా బామ్ రకాలను వాడతారు. నూనె ఆధారిత క్లీన్సర్ల వల్ల చర్మం పొడిబారదు.
2) వాటర్ బేస్డ్ క్లీన్సర్: కె బ్యూటీలో రెండు రకాల పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇస్తారు. మొదట నూనె ఆధారిత ద్రావకంతో చర్మాన్ని శుభ్రం చేయడం. రెండోది సబ్బు లేదా క్రీమ్‌ను పూసి నీళ్లతో కడగడం. దీనివల్ల చర్మంపై చేరిన మలినాలు, స్వేదం, జిడ్డు పూర్తిగా తొలగిపోతాయి.
3) చర్మం పై పొరను శుభ్రపరచడం (ఎక్స్‌ఫోలియేటర్): క్రీములతో చర్మాన్ని శుభ్రపరచడం. వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే చాలు. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. పట్టులాంటి మృదుత్వాన్ని పొందుతుంది.
4) టోనర్: శుభ్రపరచిన తరవాత టోనర్లతో చర్మాన్ని తాజాగా ఉంచుతారు కొరియన్లు. ఈ టోనర్లు పీహెచ్ స్థాయుల్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉంటాయి.
5) ఎసెన్సెస్: కొరియన్ స్కిన్‌కేర్‌లో అతి ముఖ్యమైనది. ‘ఎసెన్సెస్’ నీటి ఆధారిత ద్రవాలు. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉండడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ స్వభావాన్ని బట్టి ఎసెన్సెస్‌లను ఎంచుకోవాలి.
6) ట్రీట్‌మెంట్స్: మొటిమలు, ముడతలు, పిగ్మెంటేషన్, పెద్ద రంధ్రాలు ... ఇలా ఏ చర్మ సమస్య అయినా సరైన సీరమ్, బూస్టర్‌లను ఉపయోగిస్తారు.
7) మాస్కులు: సహజ పదార్థాలతో తయారుచేసిన మాస్కులను వేసుకోవడం వల్ల మలినాలు తొలగడమే కాకుండా, చర్మానికి కొత్త కాంతి చేకూరుతుంది.
8) ఐ క్రీమ్: శరీరంలో ముఖ్యమైన కన్ను, దాని చుట్టుపక్కల ఉండే అతి సున్నితమైన చర్మాన్ని పరిరక్షించేందుకు ఐ క్రీమ్‌లను వాడతారు. ఇది ‘కె’ బ్యూటీలో కీలకం.
9) మాయిశ్చరైజర్స్: క్లీనింగ్, టోనింగ్... ఇలా రకరకాల చర్యల వల్ల చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్ పనికొస్తుంది. దీనితో చర్మతత్వం చెడిపోదు.
10) ఎస్‌పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్): హానికారకమైన అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించేందుకు ముఖ్యమైనది సన్‌స్ర్కీన్. చర్మాన్ని లేతగా ఉంచే గుణమూ దీనికి ఉంది. కాబట్టి కే బ్యూటీలో ‘ఎస్‌పీఎఫ్’ ఉన్న సన్‌స్ర్కీన్‌లకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.