AP Power Sector: స్మార్ట్ షాక్
ABN , Publish Date - Jun 08 , 2025 | 03:22 AM
ప్రతిపక్షంలో ఉండగా అదానీ, షిర్డీసాయి విద్యుత్తు స్మార్ట్ మీటర్ల బిగింపు వద్దని చెప్పిన కూటమి.. ఇప్పుడు అవే విధానాలను అమలు చేస్తోంది. స్మార్ట్ మీటర్ల బిగింపు నుంచి వ్యవసాయ విద్యు త్తు కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చినా.. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు బిగిస్తున్నారు.

అదానీ మీటర్లు బిగించాక భారీగా కరెంటు చార్జీలు
పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై బిల్లుల మోత
స్మార్ట్ మీటర్లపై జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్టు
సాగుకు షిర్డీసాయి.. పట్టణాలకు అదానీతో
కూటమి వచ్చాక సాగుకు మినహాయింపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రతిపక్షంలో ఉండగా అదానీ, షిర్డీసాయి విద్యుత్తు స్మార్ట్ మీటర్ల బిగింపు వద్దని చెప్పిన కూటమి.. ఇప్పుడు అవే విధానాలను అమలు చేస్తోంది. స్మార్ట్ మీటర్ల బిగింపు నుంచి వ్యవసాయ విద్యు త్తు కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చినా.. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు బిగిస్తున్నారు. నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్తు వాడే పట్టణ గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి అమలు చేయడం లేదు. పరిశ్రమలకు అదానీ స్మార్ట్ మీటర్లు బిగించాక వస్తున్న కరెంటు బిల్లులు చూసి పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. విద్యుత్తు వాడకపోయినా బిల్లులు తడిసిమోపెడవుతున్నాయని వాపోతున్నారు. విద్యుత్తు రంగానికి అదానీ స్మార్ట్ మీటర్ గుదిబండగా మారనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లతో వినియోగదారులపై చార్జీల భారం మోయలేనంతగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ జరిగింది
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ విద్యుత్తు వాడకం లెక్కలు తేలాలంటూ.. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ మీటర్లను బిగించేందుకు కేంద్ర ప్రభుత్వ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) నిధులను బూచిగా చూపారు. ఆర్డీఎస్ఎస్‌లో చేరితేనే ఇంధన సంస్థల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుందని జగన్ నమ్మబలికారు. స్మార్ట్ మీటర్ల బిగింపునకు ముందుకు వచ్చే సంస్థల కోసం టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొనేందుకు వీలు లేకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)లో ఎన్‌ప్యానల్ అయిన సంస్థలకు మాత్రమే బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ విధానంతో పోటీ తత్వాన్ని మొగ్గలోనే తుంచేశారు. టెండర్లు తెరిచాక షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, అదానీ సంస్థలు బిడ్ దక్కించుకున్నాయి. సంప్రదింపుల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్... పట్టణ ప్రాంతాల్లోని పారిశ్రామిక, వాణిజ్య, నెలకు 200 యూనిట్లకు పైగా కరెంటు వాడేవారికి అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు అనుమతులు ఇచ్చారు. స్మార్ట్ మీటర్లను బిగించేందుకు గాను సింగిల్ ఫేజ్ వినియోగదారులు నెలకు రూ.86, త్రీ ఫేజ్ వినియోగదారులు నెలకు రూ.196 చొప్పున 92 నెలల పాటు చెల్లించాలి. అంటే.. సింగిల్ ఫేజ్ వినియోగదారులపై రూ.7,912, త్రీ ఫేజ్ వినియోగదారులపై రూ.16,192 భారం పడుతుంది. బహిరంగ మార్కెట్లో ఈ మీటర్ల ధర రూ.3,200 నుంచి రూ.7,800 వరకు మాత్రమే ఉండగా.. డబుల్ ధరలు నిర్ణయించారు. దీనికి యాజమాన్య నిర్వహణ ‘ట్యాగ్’ను తగిలించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఎన్నికలు సమీపించడం, విద్యుత్తు చార్జీలను పెంచుతూ వచ్చిన జగన్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో స్మార్ట్ మీటర్ల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జగన్ సర్కారు ఓటమికి విద్యుత్తు చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల రుద్దుడు కూడా ఓ కారణం.
మళ్లీ తెరపైకి...
కూటమి అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు బిగించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగిస్తే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని గ్రహించిన కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదన విరమించుకుంది. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థతో కాంట్రాక్టును రద్దు చేసుకుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక, వాణిజ్య, నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్తును వాడే వినియోగదారులకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించే ప్రక్రియను ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ ప్రారంభించాయి. మొదట పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు అదానీ స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని డిస్కమ్‌లు చేపట్టాయి. స్మార్ట్ మీటర్లు బిగించాక భారీగా బిల్లులు రావడంతో పారిశ్రామికవేత్తలలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. పరిశ్రమలను మూసేయడం మినహా తమకు మరో గత్యంతరం లేదని వాపోతున్నారు. మీటర్ల పనితీరును ముందస్తుగా పరీక్షించకుండా నేరుగా బిగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే డిస్కమ్‌లు తేలిగ్గా కొట్టి పారేస్తున్నాయి. పరిశ్రమలు విద్యుత్తు వినియోగించని సమయంలో కెపాసిటర్లను ఆపేయాలని సూచిస్తున్నాయి.
మాకూ అదే అమలు చేయండి
స్మార్ట్ మీటర్ల విషయంలో జగన్ సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదన్న ప్రశ్నకు ఇంధన సంస్థలు నేరుగా సమాధానం చెప్పడం లేదు. ఆర్‌డీఎ్‌సఎస్‌కింద నిధులు రావాలంటే సంస్కరణలు అమలు చేయాల్సిందేనని చెబుతున్నాయి. టెండర్లు రద్దుచేస్తే న్యాయచిక్కులు వస్తాయని అంటున్నాయి. ఇదే నిజమైతే.. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లను బిగించే కాంట్రాక్టును షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌తో ఎలా రద్దు చేసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పడంలేదు. షిర్డీ సాయికి అడ్డురాని మార్గదర్శకాలు అదానీకి ఎందుకు వస్తాయని నిపుణులు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ విద్యు త్తు మీటర్లపై తీసుకున్న నిర్ణయాన్నే పరిశ్రమలు, వాణి జ్య, పట్టణ గృహాలకు అమలు చేయాలని కోరుతున్నాయి.