Share News

పంజాబ్ కింగ్స్‌పై ఓటమి.. వర్షం మా ఆటపై ప్రభావం చూపింది: శుభ్‌మన్ గిల్

ABN , Publish Date - Apr 01 , 2026 | 07:33 AM

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. తమ ఓటమిపై స్పందించాడు.

పంజాబ్ కింగ్స్‌పై ఓటమి.. వర్షం మా ఆటపై ప్రభావం చూపింది: శుభ్‌మన్ గిల్
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ కూపర్ కానోలీ అద్భుతంగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. తమ ఓటమిపై స్పందించాడు. జట్టు పరాజయానికి గల కారణాలను వెల్లడించాడు.


‘లోయరార్డర్ బ్యాటర్లు స్లోగా ఆడారు. ఆఖరి ఐదు ఓవర్లలో వేగంగా పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. పిచ్ స్లోగా ఉండటంతో చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్‌కు బ్యాటింగ్ సులువైంది. చిరుజల్లుల కారణంగా బంతి తడిచి బ్యాట్‌పైకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓడినా మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. ఈ పిచ్‌పై 210-220 పరుగులు చేయడం సాధ్యమే. కానీ మేం 175 సరిపోతుందని భావించాం. సాయి సుదర్శన్, బట్లర్, ఫిలిప్స్ లాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ లక్ష్యాన్ని పెంచలేకపోయాం. బంతి పాతబడే కొద్దీ పిచ్ స్లోగా మారింది. షాట్స్ ఆడటం కష్టమైంది. రెండో ఇన్నింగ్స్‌లో వర్షం రావడంతో బంతి తడిసింది. దాంతో బ్యాటింగ్ ఈజీగా మారింది. అయినప్పటికీ మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ఆఖరి వరకు పోరాడి పంజాబ్ కింగ్స్‌పై ఒత్తిడి పెంచాం.


ప్రసిద్ధ్ కృష్ణతో ముందుగానే బౌలింగ్ చేయించాల్సింది. అయినా అతడు సరైన సమయంలోనే వచ్చి ఇంపాక్ట్ చూపించాడు. ఆఖరి వరకు ఆటలో ఉండేలా చేశాడు. ప్రసిద్ధ్‌తో ముందుగానే బౌలింగ్ చేపిస్తే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ వికెట్ స్లోగా మారుతున్న క్రమంలో వేగంగా బౌలింగ్ చేసే బౌలర్ అయితే వికెట్లు తీయగలడని నేను భావించాను. అశోక్ శర్మ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు మాకు దొరికిన ఆణిముత్యం. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అనుభవం పొందే కొద్దీ విలువైన ఆటగాడిగా మారిపోతాడు’ అని గిల్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

విషాదం.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

దూబె ఔట్ అయినప్పుడు గన్ సెలబ్రేషన్స్.. జడ్డూ ఏమన్నాడంటే?

Updated Date - Apr 01 , 2026 | 07:33 AM