Share News

ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:58 PM

తమిళనాడు అభివృద్ధికి డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం తప్పనిసరని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని చిత్తుగా ఓడించి దానిని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్
MK Stalin

తిరుచ్చి: తమిళనాడు అభివృద్ధికి డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం తప్పనిసరని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని చిత్తుగా ఓడించి దానిని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్, మణిపుర్‌ తరహాలో తమిళనాడులో అల్లర్లు సృష్టించేందుకు కాషాయం పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపించే ఘర్షణలు, మూకదాడులు తమిళనాడులో లేవని, కాషాయం పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే తమిళనాడు పేరును 'దక్షిణ ప్రదేశ్‌'గా మార్చేందుకు కూడా వెనుకాడదని ఓటర్లను హెచ్చరించారు. తిరుచ్చి జిల్లా నుంచి బుధవారంనాడు ఎన్నికల ప్రచారాన్ని స్టాలిన్ ప్రారంభించారు. జిల్లా నుంచి సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ తరఫున పోటీ చేస్తున్న 9 మంది అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం సాగించారు.


రాజ్యసభలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను ఆమోదించడం ద్వారా మైనారిటీలు, శ్రీలంక తమిళులను అన్నాడీఎంకే, పీఎంకే వంచించాయని స్టాలిన్ విమర్శించారు. 'అప్పట్లో సీఏఏ ప్రభావం ఏ ఒక్కరిపై పడదని పళనిస్వామి సమర్ధించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి మైనారిటీ ఓట్ల కోసం సీఏఏ ఒక చారిత్రక తప్పిదం అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఆయనను ఒక ప్రశ్న అడుగుతున్నాను. సీఏఏకి మీరు మద్దతిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? మీకు ధైర్యం ఉంటే బహిరంగంగా దీనిపై సమాధానం ఇవ్వాలి' అని సవాల్ విసిరారు.


పడయప్ప డైలాగ్..

అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి నాయకుడైతే, చిన్న పార్టీలు అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై కాకుండా బీజేపీ కమలం గుర్తుపై ఎందుకు పోటీ చేస్తున్నాయని స్టాలిన్ నిలదీశారు. 'పడయప్ప' చిత్రంలోని ఓ డైలాగ్‌ను స్టాలిన్ ప్రస్తావిస్తూ 'పెళ్లికొడుకు ఈయనే.. కానీ ఆయన వేసుకున్న డ్రస్సు నాదే' అన్నట్టు అన్నాడీఎంకే పరిస్థితి ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారనే కానీ, ఈపీఎస్‌ను మఖ్యమంత్రిని చేస్తామని కానీ, అన్నాడీఎంకే పేరు కానీ ప్రస్తావించడం లేదన్నారు.


ఏడోసారి కూడా మనమే..

డీఎంకే ఏడోసారి కూడా అధికారంలోకి వస్తుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ద్రవిడియన్ మోడల్ గవర్నమెంట్ కొనసాగుతుందన్నారు. ఎన్డీయే, ఆ కూటమి బానిసైన అన్నాడీంకే అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఊహించని కడగండ్లపాలు చేస్తారని, తమిళనాడు తమిళనాడులాగానే ఉండాలి కానీ, ఉత్తర్‌ప్రదేశ్, మణిపుర్ తరహాలో హింసాత్మకంగా మారకూడదన్నారు. ఇందుకోసం తమిళనాడు రాష్ట్రం మొత్తం ఒకటిగా నిలిచి బీజేపీ-అన్నాడీఎంకే కూటమిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ద్రవిడయన్ మోడల్ ఇంజిన్ అనేది సూపర్-ఫాస్ట్ ఇంజిన్ అని, బీజేపీ డబ్బా మోడల్ ఇంజిన్‌ ముందు తలవంచదని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

నేటి నుంచి తొలి దశ ‘జనగణన 2027’..

విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇంధన ధర రెట్టింపు

Updated Date - Apr 01 , 2026 | 04:25 PM