చేనేత రంగం బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:45 PM
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
అమరావతి, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చిన్న చేనేత కుటుంబాలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చిన ఉచిత విద్యుత్ పథకం చేనేత రంగానికి బలాన్నిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు 200 యూనిట్లు, మర మగ్గానికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 వేల చేనేత మగ్గాలు, 11,488 పవర్ లూమ్ యూనిట్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి వ్యయం తగ్గి, చేనేత కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట కలగనుందని నిపుణులు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ తన సందేశంలో గతాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. 2017లో నేతన్నలు తమ సమస్యలు వివరించినప్పుడు తనకు తీవ్రంగా బాధ కలిగిందని తెలిపారు. అప్పటినుంచే చేనేత రంగానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నానని, చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించానని చెప్పారు. వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని ఇచ్చిన పిలుపు యువతలో మంచి స్పందన తెచ్చిందని పేర్కొన్నారు.
అలాగే నివార్ తుపాను సమయంలో వెంకటగిరి ప్రాంతంలో చేనేత మగ్గాలకు జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూసి బాధపడ్డానని, అప్పుడు ఇచ్చిన భరోసాను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత 21 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్న ప్రతి చేనేత కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
చేనేతలకు ఉచిత కరెంట్‌పై హోం మంత్రి అనిత ఇంటింటి ప్రచారం
బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్