‘లెన్స్‌కార్ట్’తో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:54 AM
ప్రపంచంలోనే అతిపెద్ద.. కళ్లద్దాల తయారీ పరిశ్రమ కార్యకలాపాలు అతి త్వరలోనే తెలంగాణలో ప్రారంభం కానున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు అన్నారు. ప్రముఖ కళ్లజోళ్ల బ్రాండ్ లెన్స్‌కార్ట్ ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం కానుందని తెలిపారు.

1500 కోట్లతో రావిర్యాలలో లెన్స్‌కార్ట్ ప్లాంట్..2 వేల మందికి ఉద్యోగాలు: మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, మహేశ్వరం, మార్చి6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతిపెద్ద.. కళ్లద్దాల తయారీ పరిశ్రమ కార్యకలాపాలు అతి త్వరలోనే తెలంగాణలో ప్రారంభం కానున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు అన్నారు. ప్రముఖ కళ్లజోళ్ల బ్రాండ్ లెన్స్‌కార్ట్ ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం కానుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలోని రావిర్యాలలో 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న లెన్స్‌కార్ట్ విజన్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం, లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గతేడాది డిసెంబర్ 8న ఒప్పందం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. లెన్స్‌కార్ట్‌కు రాజస్థాన్‌లో ఇప్పటికే ఓ తయారీ యూనిట్ ఉందని, రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్దదని తెలిపారు. లెన్స్‌కార్ట్ పరిశ్రమ రాష్ట్రానికి తలమానికం కానుందని అన్నారు. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
పరిశ్రమలో ఉద్యోగ కల్పనలో స్థానికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని లెన్స్‌కార్ట్ యాజమాన్యానికి సూచన చేశామని తెలిపారు. రెండేళ్లలో ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. ఈ పరిశ్రమలో తయారయ్యే ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతాయని మంత్రి తెలిపారు. దీంతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం అవుతుందన్నారు. ఇక, ప్రపంచ స్థాయి పరిశ్రమలకు రంగారెడ్డి జిల్లా నిలయంగా మారుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్థన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, లెన్స్‌కార్ట్ ప్రతినిధులు చౌదరి, సుమిత్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న మహేశ్వరం డీసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా అన్నారు.