Seethakka: మావోయిస్టుల లేఖపై స్పందించిన మంత్రి సీతక్క
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:58 AM
ఆదివాసీల వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై మావోయిస్టులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి సీతక్క కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. అయితే..

ములుగు, జూన్ 27: ఆదివాసీల వ్యవహారంలో మావోయిస్టులు తనకు సంధించిన లేఖపై తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క స్పందించారు. తన మూలాలను తానెప్పుడు మరిచి పోలేదన్నారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో మంత్రి సీతక్క విలేకర్లతో మాట్లాడుతూ.. జీవో 49ను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టానని వివరించారు. ఆ క్రమంలో ఆదివాసీల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతోపాటు తానూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్పా.. ఎవరూ ఆదివాసీల జోలికి వెళ్లడం లేదని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. అయితే ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడాలంటూ మావోయిస్టులకు ఆమె పరోక్షంగా సూచించారు.
ఆదివాసీల వ్యవహారంపై ఇవాళ(శుక్రవారం) ఉదయం మంత్రి సీతక్కకు మావోయిస్టులు లేఖ రాశారు. ఈ లేఖలో వారు ఏమన్నారంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా పని చేస్తున్న మాజీ మావోయిస్టు సీతక్క.. ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 49తో కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.
ఈ జీవో 49 కారణంగా రాష్ట్రంలో మూడు జిల్లాలు కనుమరుగవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టెందుకే జీవో నెం. 49 తీసుకువచ్చారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఈ లేఖపై మంత్రి సీతక్క వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పేలిన ఎలక్ట్రిక్ బైక్.. మహిళ మృతి
మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక
For More AndhraPradesh News And Telugu News