Medaram Telangana Ministers: మేడారంలో తెలంగాణ మంత్రులు... పునర్నిర్మాణ పనుల పరిశీలన
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:41 PM
మేడారం వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకున్నారు.
ములుగు, నవంబర్ 12: మేడారంలో తెలంగాణ మంత్రులు పర్యటించారు. ఈరోజు (బుధవారం) మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని... అక్కడి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆపై వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పనులు జరుగుతున్నాయని.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. పదికోట్ల మంది భక్తులు వచ్చినా దర్శనానికి ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ పనులు చేస్తున్నామని... ఆదివాసీ పూజారుల ఆలోచనతోనే పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
జాతీయ పండుగా గుర్తించాలి: మంత్రి కొండా సురేఖ
గతంలో మేడారంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక మేడారం అభివృద్ధి జరుగుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని.. దీనిపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి ప్రధాన మంత్రిని నరేంద్ర మోడీని ఒప్పించాలని మంత్రి సీతక్క కోరారు. మేడారం మహాజాతర నాటికి పనులు పూర్తవుతాయని.. జాతర నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.
దేవుడిపై రాజకీయాలా?: మంత్రి సీతక్క
మేడారం అంటే తమ బంధం, భక్తి, భావోద్వేగం, బాధ్యత అని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. మేడారంలో పది తరాలకు సరిపడ అభివృద్ధి చేస్తామన్నారు. దీక్షతో, బాధ్యతతో జాతరనాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై రాజకీయాలు చేయొద్దని హితవుపలికారు. గతంలో వేసిన షెడ్లను తొలగించి పక్కకు పెట్టామన్నారు. మేడారంలో ఎలాంటి ప్రతిమలు లేకపోయినా కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారన్నారు. సమ్మక్క - సారలమ్మ ఆదివాసీల అస్థిత్వానికి సంకేతమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎక్కడి సమస్యలు అక్కడే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కవిత విసుర్లు
మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం
Read Latest Telangana News And Telugu News