Harish Rao: పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందే.. లేదంటే జరిగేది ఇదే: హరీష్ రావు
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:23 AM
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందే అని హరీష్ డిమాండ్ చేశారు.
వరంగల్, నవంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) వార్నింగ్ ఇచ్చారు. పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలస్ ముందు పోసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను హరీష్ రావు, బీఆర్‌ఎస్ నేతలు పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సీసీఐ తుగ్లక్ చర్యల వల్ల రైతులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు విధిలేక దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నిలువునా ముంచుతున్నాయని మాజీ మంత్రి విమర్శించారు.
రేవంత్ రెడ్డి అరవై సార్లు ఢిల్లీకి వెళ్లారని.. మూటలు పంపుతున్నారు గానీ రైతుల సమస్యలు బడేబాయ్‌కు చెప్పరా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారని.. మరి రైతులకు మద్దతు ధర ఇప్పించరా అంటూ నిలదీశారు. కపాస్ యాప్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలకంటే పంటపొలాల్లో దిష్టి బొమ్మలు నయమంటూ వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకునేందుకు నిబంధనలు సడలించారని.. కానీ రైతులకు మాత్రం న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.
ఇప్పటి వరకూ 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవాలు జరుపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కాగా.. హరీష్ రావుతో పాటు పత్తియార్డును బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మధుసూదనాచారి, చల్లా ధర్మారెడ్డి, మాలోత్ కవిత పరిశీలించారు.
ఇవి కూడా చదవండి...
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం
Read Latest Telangana News And Telugu News