Kaushik Reddy Case: కౌశిక్ రెడ్డి కేసు.. సీపీని కలిసిన గులాబీ నేతలు
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:20 PM
Kaushik Reddy Case: సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

వరంగల్, జూన్ 21: గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (MLA Padi Kaushik Reddy) సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి వరంగల్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేపై సెక్షన్ 308(2), (4), 352 కింద కేసు నమోదు అయ్యింది. దీంతో కౌశిక్ రెడ్డి కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలు వరంగల్ చేరుకుని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను కలిశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, లీగల్ టీమ్.. సీపీని కలిశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసు సెక్షన్లను మార్చాలని ఈ సందర్భంగా గులాబీ నేతలు కోరారు. లీగల్ అడ్వైజర్లతో మాట్లాడి చెప్తానని సీపీ సమాధానం ఇచ్చారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు తిరిగి వెళ్లిపోయారు.
కావాలనే కేసులు: ఎర్రబెల్లి ఆగ్రహం
అయితే సీపీ దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ రాకుండా కుట్రలు చేసి జైలుకు పంపాలని చూస్తున్నారు మీడియాతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలేబుల్ కేసు పెట్టారని ఆరోపించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. రేవంత్ పాలన అట్టర్ ప్లాప్ అని.. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కోసమే నేతలను అరెస్ట్ చేశారన్నారు. తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రుల్లో కో ఆర్డినేషన్ లేదన్నారు. రాహుల్ మాట రేవంత్ వినే పరిస్థితి లేదని... రేవంత్ మాట రాహుల్ గాంధీ వినే పరిస్థితి లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు.
కాగా అంతుకు ముందు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కౌశిక్ రెడ్డిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ఎర్రబెల్లితో పాటు కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి, కౌశిక్ సోదరుడు ప్రతీక్ రెడ్డి కూడా ఎమ్మెల్యేను కలిశారు. మరి కాసేపట్లోనే వైద్య పరీక్షల కోసం కౌశిక్‌ను ఎంజీఎంకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యేను కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి
సిట్ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యాప్‌పైనే విచారణ
యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్
Read latest Telangana News And Telugu News