National Turmeric Board: పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:52 AM
కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. దేశంలోని 24 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిసా, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. గతంలో స్పైసెస్ బోర్డు కింద ఈ పసుపు రైతులకు సేవలందేవి.

పంట ఉత్పత్తులకు మార్కెటింగ్
పసుపు సాగులో అధునాతన శిక్షణ
రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు
పసుపు ఆధారిత పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానం
నిజామాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. దేశంలోని 24 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిసా, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. గతంలో స్పైసెస్ బోర్డు కింద ఈ పసుపు రైతులకు సేవలందేవి. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయం ద్వారా వీరికి సేవలందనున్నాయి. ఈ రైతులకు సంబంధించిన పంటల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతోపాటు అధునాతన శిక్షణను బోర్డు ద్వారా అందించనున్నారు. పసుపు ఎగుమతులకు కావాల్సిన మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా బోర్డు ద్వారా కల్పించనున్నారు. పసుపు రైతులతో కలిపి రైతు ఉత్పత్తిదారుల సంఘాలనూ ఏర్పాటు చేయనున్నారు.
ఈ సంఘాలతో పాటు బోర్డు ద్వారా పసుపు ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నారు. కాగా, జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన పసుపు స్టాళ్లను పరిశీలించారు. అమిత్‌షా వెంట పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, కె.లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క తదితరులు ఉన్నారు.