ORR Road Accident: నెత్తురోడిన ఔటర్!
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:52 AM
ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి అతి వేగంతో ఢీ కొట్టింది.

ఆదిభట్ల వద్ద ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
ఐదుగురి దుర్మరణం.. కారులో మద్యం సీసాలు?
ముందువెళ్తున్న లారీని అతివేగంగా ఢీకొట్టిన కారు
దైవదర్శనానికని వెళ్లి.. మధ్యలోనే వెనుదిరిగి!
ఆదిభట్ల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి అతి వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధి బొంగులూరు వద్ద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రీన్ వ్యాలీ రిసార్ట్‌లో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దాసరి తండాకు చెందిన గుగులోత్ జనార్దన్ (45), వరంగల్ జిల్లా పాకాలకు చెందిన మాలోత్ చందులాల్ (29), ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు దాసరి భాస్కర్‌రావు (39), విజయనగరం జిల్లాకు చెందిన జాడ కృష్ణ (25) పని చేసేవారు.. వీరికి స్థానికం ఉండే కావలి బాల్‌రాజ్(40)తో కొంతకాలంగా పరిచయముంది. ఈ నేపథ్యంలోనే అతడి కారులో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఎన్కేపల్లి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి అని ఇంట్లో వారితో చెప్పి బయలుదేరారు. కాగా.. తెల్లవారు జామున తిరుగు ప్రయాణంలో ఘట్కేసర్ వద్ద 2.45 గంటలకు కారుతో ఔటర్ రింగు రోడ్డుపైకి వచ్చారు.
ఈ నేపథ్యంలోనే 3 గంటల సమయంలో ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంతో వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న జనార్దన్, చందులాల్, భాస్కర్‌రావు, బాల్‌రాజ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించగా.. ప్రాణాలతో ఉన్న కృష్ణను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అతడి పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమవ్వగా.. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో అతికష్టమ్మీద బయటకు తీశారు. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధి మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. కాగా.. దైవదర్శనానికని ఇంట్లో వాళ్లకు చెప్పి బయలుదేరిన వీరు.. మార్గమధ్యలోనే వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఆ రాత్రి వీరు ఎక్కడ ఆగారనేది సస్పెన్స్‌గా మారింది. కారులో మద్యం సీసాలు దొరికినట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి