Share News

Power Demand: వేసవికి ముందే విద్యుత్తు కొనుగోళ్లు!

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:51 AM

వేసవి ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ పెరిగింది. దీంతో విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) పవర్‌ ఎక్స్‌చేంజ్‌ల నుంచి భారీగా విద్యుత్తు కొనుగోలు చేస్తున్నాయి.

Power Demand: వేసవికి ముందే విద్యుత్తు కొనుగోళ్లు!

  • భారీగా కొనుగోలు చేస్తున్న డిస్కమ్‌లు

  • రోజుకు సగటున 70 మిలియన్‌ యూనిట్లు

  • రూ.50 కోట్ల చెల్లింపు.. ఉత్పత్తి తగ్గుదల వల్లే

  • బహిరంగ విపణిలో టాప్‌లో తెలంగాణ

  • దక్షిణాదిలో ఐఈఎక్స్‌ విక్రయిస్తున్న విద్యుత్తులో 90 శాతం కొనుగోళ్లు మనవే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వేసవి ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ పెరిగింది. దీంతో విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) పవర్‌ ఎక్స్‌చేంజ్‌ల నుంచి భారీగా విద్యుత్తు కొనుగోలు చేస్తున్నాయి. ఈ కొనుగోలు సాధారణంగా వేసవిలో కొనుగోలు చేసే విద్యుత్తు కన్నా ఎక్కువగా రికార్డు స్థాయిలో ఉంటుండడం గమనార్హం. మునుపెన్నడూ లేనివిధంగా గత నెల రోజులుగా తెలంగాణ డిస్కమ్‌లు రోజుకు సగటున 70 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్తు కొనుగోలు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ జనవరి నెలలో ఈ స్థాయిలో విద్యుత్తు ఎక్స్‌చేంజ్‌ల నుంచి కొనుగోలు చేయలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గతేడాది డిసెంబరు నుంచి జనవరి తొలివారం వరకు రోజుకు సగటున 100-125 ఎంయూల విద్యుత్తును కొనుగోలు చేసి డిస్కమ్‌లు కొత్త రికార్డు సృష్టించాయి. గత డిసెంబరు 29న అత్యధికంగా 124.54 ఎంయూల విద్యుత్తును కొనుగోలు చేయడం గమనార్హం. విద్యుత్తు డిమాండ్‌ పెద్దగా లేని సమయాల్లో యూనిట్‌కు రూ.2.5 కనిష్ఠ ధరతో పవర్‌ ఎక్స్‌చేంజిల్లో విద్యుత్తును విక్రయిస్తుండగా, డిమాండ్‌ గరిష్ఠంగా పెరిగే వేళల్లో యూనిట్‌కు రూ.10 గరిష్ఠ ధరతో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం పవర్‌ ఎక్స్‌చేంజ్‌ల నుంచి విదుత్తు కొనుగోలు చేసేందుకు రోజుకు సగటున రూ.50 కోట్ల వరకు వెచ్చిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకుగాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు రూ.2వేల కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేసింది.


ఎక్స్‌చేంజ్‌ కొనుగోళ్లలో తెలంగాణ టాప్‌..

ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్‌చేంజ్‌ (ఐఈఎక్స్‌) ద్వారా దక్షిణాది రాష్ర్టాలకు విక్రయిస్తున్న విద్యుత్తులో 90 శాతానికి పైగా తెలంగాణ రాష్ట్రమే కొనుగోలు చేస్తుండటం గమనార్హం. దక్షిణాదిలో తమిళనాడు, ఏపీ, కర్ణాటక, కేరళ వంటి రాష్ర్టాలు నామమాత్రంగా విద్యుత్తు కొనుగోలు చేస్తుండగా, వీటిలో కొన్ని రాష్ర్టాలు తమ మిగులు విద్యుత్తునే ఐఈఎక్స్‌కి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంకా వేసవి ప్రారంభం కాకపోవడం, ఇతర రాష్ర్టాల్లో విద్యుత్తు డిమాండ్‌ నిలకడగా ఉండడంతో పెద్దగా విద్యుత్తు కొనుగోలు చేయడం లేదు. గతేడాది డిసెంబరు 29న ఐఈఎక్స్‌ విక్రయించిన విద్యుత్తులో ఏకంగా 87 శాతాన్ని తెలంగాణ రాష్ట్రమే కొనుగోలు చేసింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) థర్మల్‌, హైడల్‌ విద్యుత్తు కేంద్రాల్లో స్థాపిత సామర్థ్యంతో పోలిస్తే ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వల్లే పవర్‌ ఎక్స్‌చేంజ్‌ల నుంచి ప్రైవేటు విద్యుత్తును భారీ మొత్తంలో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొన్ని యూనిట్లలో మరమ్మతులు చేయకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోగా, మరికొన్ని యూనిట్లలో ఉత్పత్తిని తగ్గించి బ్యాక్‌డౌన్‌ చేస్తున్నట్టు ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) గణాంకాలు చెబుతున్నాయి. జెన్‌కో ప్రస్తుతం 4842.5 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు, 2441.8 మెగావాట్ల జలవిద్యుత్తు కేంద్రాలను కలిగి ఉండగా, ఇవి 2024 ఏప్రిల్‌ 1 నుంచి 2025 ఫిబ్రవరి 2 వరకు కేవలం 63.72 శాతం సామర్థ్యం (పీఎల్‌ఎ్‌ఫ)తో మాత్రమే విద్యుదుత్పత్తి చేశాయి. గతంలో సగటున 80 శాతం వార్షిక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని జెన్‌కో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు కలిగి ఉండేవి.


జలవిద్యుత్‌ జోష్‌

  • 5 వేల మిలియన్‌ యూనిట్లు దాటిన ఉత్పత్తి

  • పలు స్టేషన్లు మూతపడినా మెరుగైన పనితీరు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మరమ్మతులు చేయకుండా పలు యూనిట్లు మూతపెట్టినప్పటికీ తెలంగాణలోని జలాశయాల కింద జెన్‌ కో భారీగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. సోమవారంతో రాష్ట్రంలోని వివిధ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో తయారైన కరెంటు 5 వేల మిలియన్‌ యూనిట్లను తాకింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్‌లో 2,441.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్‌ కేంద్రాలున్నాయి. ఇందులో రెండు మూడేళ్లుగా 200 మెగావాట్లకు పైగా సామర్థ్యం కలిగిన విద్యుత్‌ కేంద్రాలు మూతపడ్డాయి. 2024-25 జల సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతీ జలాశయానికి భారీగా వరదలు వచ్చాయి. అయితే విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడంలో అధికారుల వైఫల్యంతో రోజుకు రూ.కోట్ల ఆదాయాన్ని జెన్‌కో కోల్పోయింది. ప్రస్తుతం వివిధ జలాశయాల కింద రోజుకు 6 మిలియన్‌ యూనిట్ల దాకా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. 11 ఏళ్ల లెక్కలను పరిశీలిస్తే 2022-23లో అత్యధికంగా 6,057.9 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్‌ ఉత్పాదన జరిగింది.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 04:51 AM