CM Relief Fund: 14 నెలల్లోనే 905 కోట్లు!
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:39 AM
రాష్ట్రంలో ‘ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)’ పథకం అమలులో ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 14 నెలల్లోనే రూ.905 కోట్ల మేర నిధులు విడుదల చేసింది.

సీఎంఆర్‌ఎఫ్ కింద సర్కారు రికార్డు సాయం
గంటల వ్యవధిలోనే ఎల్‌వోసీల మంజూరు
పేద, మధ్యతరగతి వారికి వేగంగా సహాయం
పారదర్శకంగా అమలు చేయాలన్న సీఎం
అందుకనుగుణంగా పనిచేస్తున్న అధికారులు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)’ పథకం అమలులో ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 14 నెలల్లోనే రూ.905 కోట్ల మేర నిధులు విడుదల చేసింది. సీఎంఆర్‌ఎఫ్ కింద 2023 డిసెంబరు 7 నుంచి 2025 ఫిబ్రవరి 23 నాటికి దాదాపు 2,09,500 నిరుపేద, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సర్కారు వివిధ రూపాల్లో సాయం అందించింది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత సంబంధిత బిల్లులను జత చేసి, ప్రజాప్రతినిధి సిఫారసు ద్వారా దరఖాస్తు పెట్టుకున్నవారికి సాయం అందించడం; ఆస్పత్రిలో చికిత్సకు ముందుగానే అవసరమైన ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకుంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ) రూపంలో సాయం అందించడం.. ఇలా ఈ పథకాన్ని ప్రభుత్వం రెండు రకాలుగా అమలు చేస్తోంది. ఆస్పత్రి బిల్లులతో దరఖాస్తు చేసుకున్న సుమారు 1.93 లక్షల మందికి రూ.600 కోట్లు, ఎల్‌వోసీ కింద 16,502 మందికి రూ.300 కోట్లను ఇప్పటివరకు సాయంగా అందించింది. ఎల్‌వోసీల్లో అధికంగా నిమ్స్‌కు 286 కోట్లు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో 3.60 కోట్లు, ఈఎన్‌టీ ఆస్పత్రికి 3.57 కోట్లు అందజేసింది. ఇవిగాక వివిధ సమస్యలు ఎదుర్కొంటూ, దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బందులు పడుతూ పలు మార్గాల్లో వెలుగులోకి వస్తున్న వారికి సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఆర్థిక భరోసా ఇస్తున్నారు. ఇలాంటి కేసులకు సంబంధించి కేవలం ఆర్థిక సాయమే కాకుండా వారి కుటుంబ పోషణకు అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం తరఫున అందిస్తున్నారు. ‘ప్రజావాణి’లో సీఎంఆర్‌ఎఫ్ కోసం వచ్చిన దరఖాస్తుల విషయంలోనూ సంబంధిత అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.
గత సర్కారు ఐదేళ్లలో ఇచ్చింది 2,400 కోట్లే
సీఎంఆర్‌ఎఫ్ కింద గత ప్రభుత్వం కూడా సాయం అందించింది. అయితే 2019 నుంచి 2023 డిసెంబరు 7 నాటికి ఎల్‌వోసీలకు ఇచ్చే వాటితో కలిపి మొత్తం రూ.2,400 కోట్లను మాత్రమే అందించింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ అమల్లోనూ అవినీతి చోటుచేసుకుంది. పేదల పేరిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులను పక్కదారి పట్టించే దందా వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్‌ఎఫ్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు విచారణకు ఆదేశించింది. గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పనిచేసిన సిబ్బంది సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు తమ ఖాతాల్లో వేసుకున్న ఘటనలు తెరపైకి వచ్చాయి. దీంతో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుల పేర్లతో పాటు వారి బ్యాంక్ ఖాతా నంబరును ముద్రిస్తూ, అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. దొంగ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేయడాన్నీ నిరోధించడంతో అర్హులకే సాయం అందుతోంది.
వేగంగా ఎల్‌వోసీలు..
అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి సీఎంఆర్‌ఎ్‌ఫపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై వచ్చిన ఆరోపణలను తేల్చాలంటూ అధికారులను ఆదేశించారు. సీఎం సహాయ నిధిలో అక్రమాలకు, అవినీతికి తావుండకూడదన్న ఉద్దేశంతో ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఫలితంగా ప్రతి దరఖాస్తు విషయంలో పారదర్శకత ఉండడంతో పాటు చెక్కు మంజూరు వరకు ప్రతి దశను ఆన్‌లైన్‌లోనే తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇక ఎల్‌వోసీల జారీని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎల్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకున్న గంటల వ్యవధిలోనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో కూడా ఎల్‌వోసీలను మంజూరు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆ పిల్లల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు..
మూగ, చెవుడు సమస్యలతో జన్మించే పిల్లలకు ఆరేళ్లలోపు శస్త్రచికిత్సలు చేయిస్తే వారికి మాటలు రావడంతో పాటు చెవులు వినపడే అవకాశం ఉంటుంది. వారికి శస్త్రచికిత్సలతో పాటు అవసరమైన వినికిడి పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. ఇందుకు రూ.లక్షలు వెచ్చించాల్సి రావడంతో చాలామంది పేద కుటుంబాల వారు తమ పిల్లలకు ఆపరేషన్లు చేయించుకోలేకపోతున్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారవర్గాలు తెలిపాయి. వైద్యారోగ్యశాఖ సిబ్బంది, కలెక్టర్లు, ఇతర అధికారులు, సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చినవారికి ప్రత్యేకంగా చికిత్సలు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. 14 నెలల్లో సుమారు 104 కేసులకు ప్రభుత్వం ఎల్‌వోసీలను మంజూరు చేసింది. మొత్తంగా సీఎం సహాయనిధి ద్వారా నిజమైన అర్హులకు సాయం అందించాలన్న సీఎం లక్ష్యం ఫలిస్తోందని ప్రజాప్రతినిఽధులు, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘‘ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది నిరుపేదలు, పేద, మధ్య తరగతి వారికి సంబంధించింది. దీన్ని పారదర్శకంగా అమలుచేయాలి, నిజమైన అర్హులకు ఎలాంటి సమస్య లేకుండా అందజేయాలి. అవకతవకలకు, అక్రమాలకు తావివ్వకూడదు. ’’
- సీఎంఆర్‌ఎఫ్ అమలుపై అధికారులతో సీఎం రేవంత్