Share News

Artificial Intelligence: అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ వర్సిటీ

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:25 AM

రాష్ట్రంలో రెండేళ్లలో 2 లక్షల మంది యువతను అత్యుత్తమ ఏఐ (కృత్రిమ మేధ) రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Artificial Intelligence: అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ వర్సిటీ

రెండేళ్లలో 2 లక్షల మంది కృత్రిమ మేధ నిపుణుల తయారీ.. తెలంగాణను గ్లోబల్‌ క్యాపిటల్‌ ఏఐగా తీర్చిదిద్దుతాం

  • దేశంలోనే తొలి టీజీడెక్స్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండేళ్లలో 2 లక్షల మంది యువతను అత్యుత్తమ ఏఐ (కృత్రిమ మేధ) రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. అందుకోసం త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో టి-హబ్‌లో బుధవారం దేశంలోనే తొలి ఏఐ అనుసంధానిత ‘తెలంగాణ డేటా ఎక్చ్సేంజ్‌ (టీజీడెక్స్‌)ను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తూ.. ‘ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్‌ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి. కొత్తగా ఎన్నో అవకాశాలు సృష్టించింది. ఈ మార్పును అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని ‘గ్లోబల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఏఐ’గా తీర్చి దిద్దడానికి మా సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఇప్పటికే ఏఐ స్ట్రాటర్జీ రోడ్‌ మ్యాప్‌ను రూపొందించుకుని ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది’ అని చెప్పారు. ‘ఇది దేశంలో ఏర్పాటైన తొలి ఏఐ డేటా ఎక్స్చేంజ్‌.


ప్రభుత్వ శాఖలు, స్టార్ట్‌పలు, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువతను ఒకే వేదికపై తెచ్చి సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి దారి చూపుతుంది. ఇప్పటికే ఇందులో 480కి పైగా డేటా సెట్స్‌, 3,000లకు పైగా ఏఐ స్టార్ట్‌పలు భాగస్వామ్యమయ్యాయి’ అని పేర్కొన్నారు. ఏఐని ప్రజలంతా సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు పలు సమస్యల పరిష్కారం కోసం టీజీడెక్స్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. దీని రూపకల్పనకు జైకాతోపాటు బెంగళూరులోని ఐఐఎ్‌ససీ వ్యూహాత్మక సహకారం అందించాయని చెప్పారు.


పలు సమస్యలకు పరిష్కారం..

రైతులకు మేలు చేసే అగ్రిటెక్‌ స్టార్ట్‌పలకు అవసరమైన డేటా లభించడంతోపాటు రోగులకు ఆరోగ్యశాఖ మరింత సమర్థవంతమైన సేవలందించడానికి అవసరమైన ఏఐ మోడల్స్‌ అభివృద్ధికి టీజీడెక్స్‌ ఉపకరిస్తుందని శ్రీధర్‌బాబు చెప్పారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఉపయోగ పడటంతోపాటు నూతన ఆవిష్కరణతోపాటు గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇది దిక్సూచిగా మారుతుందన్నారు. ‘వచ్చే ఐదేళ్లలో టీజీడెక్స్‌లో 2000 డేటా సెట్స్‌ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వంలో 30 ఏఐ ఆధారిత ప్రాజెక్టుల అమలుతో పాలనలో ఏఐ వినియోగానికి పెద్ద పీట వేస్తున్నాం. త్వరలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని వివరించారు.


ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..


మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 03:25 AM