Share News

Terrorism: హైదరాబాద్‌, విజయనగరంలో వరుస పేలుళ్లకు కుట్ర!

ABN , Publish Date - May 20 , 2025 | 05:03 AM

దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల మాదిరిగా.. హైదరాబాద్‌, విజయనగరంలో వరుస పేలుళ్లకు భారీ కుట్ర జరిగింది. పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీకి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకున్నారు.

Terrorism: హైదరాబాద్‌, విజయనగరంలో వరుస పేలుళ్లకు కుట్ర!

  • రంపచోడవరంలో రిహార్సల్స్‌ జరిపిన సిరాజ్‌, సమీర్‌

  • 2 సార్లు సౌదీకి సిరాజ్‌.. రిమాండ్‌ రిపోర్టులో వెల్లడి

  • రంగంలోకి ఎన్‌ఐఏ.. నిందితుల కస్టడీకి పిటిషన్‌

హైదరాబాద్‌/విజయనగరం/ఆరిలోవ(విశాఖ), మే 19 (ఆంధ్రజ్యోతి): దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల మాదిరిగా.. హైదరాబాద్‌, విజయనగరంలో వరుస పేలుళ్లకు భారీ కుట్ర జరిగింది. పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీకి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకున్నారు. అవసరమైన సరంజామాను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నారు. బాంబులను ఎలా పేల్చాలనేదానిపై రంపచోడవరం అడవుల్లో రిహార్సల్స్‌ చేశారు. సౌదీలో ఉండే ఉగ్రవాద నాయకుల ఆదేశాలతో.. పక్కా ప్రణాళికను అమలు చేసే ప్రయత్నంలో ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ఆదివారం అరెస్టయిన విజయనగరానికి చెందిన సిరాజ్‌-ఉర్‌-రెహ్మాన్‌, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో నిందితుల ఆర్థిక లావాదేవీలు సహా.. సంచలన విషయాలు వెల్లడయ్యాయి.


బీటెక్‌ చదువుతుండగా పరిచయం

హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలో సిరాజ్‌, సమీర్‌ ఒకరికొకరు పరిచయమయ్యారు. వీరిద్దరూ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ వైపు ఆకర్షితులయ్యారు. బీటెక్‌ పూర్తయ్యాక సమీర్‌ సికింద్రాబాద్‌లో లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో సౌదీలోని పలు ఉగ్రవాద సంస్థల హ్యాండ్లర్లతో సోషల్‌ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. సిరాజ్‌, సమీర్‌ సౌదీలోని ఐఎస్‌ హ్యాండ్లరు ఇచ్చే ఆదేశాలతో తెలుగురాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని ముస్లిం యువతను ఆకర్షించేందుకు అల్‌హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీమ్‌(అహిం) సంస్థను స్థాపించారు. సోషల్‌ మీడియాలో ‘మ్యాజిక్‌ లాంతర్‌’ పేరుతో ఖాతాను తెరిచి.. అహిం సంస్థలో సభ్యత్వాలిచ్చారు. అలా పదుల సంఖ్యలో యువకులు, మైనర్లను వీరు అహింలో చేర్చుకున్నారు. సౌదీలోని హ్యాండ్లర్ల ఆదేశాలతో హైదరాబాద్‌, విజయనగరంలో పేలుళ్లకు కుట్రలు పన్నారు. ఇందుకోసం సిరాజ్‌ రెండుసార్లు సౌదీ వెళ్లి వచ్చాడు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వీడియోల నుంచి పేలుడు పదార్థాల తయారీ, వాటిని పేల్చడంపై శిక్షణ తీసుకున్నాడు. తమ వ్యూహాన్ని అమలు చేయడానికి ముందు సికింద్రాబాద్‌లోని సమీర్‌ ఇంట్లో అహింసభ్యులు మూడ్రోజుల పాటు భేటీ అయ్యారు.


టిఫిన్‌ బాక్సు బాంబులు

సిరాజ్‌, సమీర్‌లు బాంబుల తయారీకి అమ్మోనియా, సల్ఫర్‌, అల్యూమినియం పౌడర్‌, టిఫిన్‌ బాక్సులు, వైర్లు, రిమోట్‌ సెల్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. వీటిని స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేస్తే.. పట్టుబడే ప్రమాదం ఉంటుందని అమెజాన్‌ వంటి ఈ-కామర్స్‌ సైట్లను ఎంచుకున్నారు. వాటితో బాంబులను తయారు చేశాక.. పరీక్షల కోసం రంపచోడవరం అటవీ ప్రాంతంలో పలుమార్లు రిహార్సల్స్‌ చేశారు. తొలుత డమ్మీ పేలుళ్లతో ప్రయత్నించి, ఆ తర్వాత హైదరాబాద్‌, విజయనగరంలో వరుస పేలుళ్లు జరపాలని కుట్రపన్నారు. జాతీయ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తే.. నిఘా సంస్థలు గుర్తిస్తాయనే ఉద్దేశంతో సిరాజ్‌ విజయనగరం జిల్లా సహకార బ్యాంకులో ఖాతా తెరిచాడని, ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఖాతా నుంచే లావాదేవీలు నిర్వహించాడని నిర్ధారించారు.


రంగంలోకి ఎన్‌ఐఏ

ఉగ్ర కుట్ర కేసు కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. సోమవారం విజయనగరానికి వస్తూనే.. స్థానిక దర్యాప్తు అధికారి నుంచి ప్రాథమిక సమాచారాన్ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతోపాటు.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని అహిం సభ్యుల వివరాలపై ఆరా తీస్తోంది. సిరాజ్‌ తండ్రి, సోదరుడు పోలీసు శాఖకే చెందిన వారు కాగా.. వారినీ ఠాణాకు పిలిపించి విచారించినట్లు సమాచారం. అహిం నెట్‌వర్క్‌కు సౌదీలోని హ్యాండ్లర్లు ఎవరు? వారు పేలుళ్లకు నిధులను ఎలా పంపుతున్నారు? అనే కోణంపైనా ఎన్‌ఐఏ దృష్టిపెట్టింది.


10 రోజుల కస్టడీకి ప్రయత్నాలు

విజయనగరం కోర్టు సిరాజ్‌, సమీర్‌లకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు వారిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. అక్కడ వీరిద్దరినీ వేర్వేరు ఐసోలేటెడ్‌ సెల్స్‌లో పెట్టి, పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్‌ మహేశ్‌బాబు తెలిపారు. అటు పోలీసులు కూడా ఈ కేసులో వీరిద్దరినీ విచారించాల్సి ఉందని పేర్కొంటూ 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే.. స్థానిక పోలీసులు, ఎన్‌ఐఏ విచారించనున్నట్లు తెలుస్తోంది. వీరిని అత్యంత రహస్యంగా విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్‌ కనెక్షన్లు.!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2025 | 05:03 AM