Telangana Youth Job Opportunities: తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగావకాశాలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:25 AM
తెలంగాణ యువతకు జపాన్‌లోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 500 ఉద్యోగాలు హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, నిర్మాణ రంగాలలో అందుబాటులో ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు

హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్).. జపాన్‌లోని ప్రముఖ సంస్థలు టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (టెర్న్), రాజ్ గ్రూప్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణలో నైపుణ్యం ఉన్న నిపుణులకు జపాన్‌లోని అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రైజింగ్ బృందం.. ఆ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి ఈ ఒప్పందాలు చేసుకుంది. కాగా, టెర్న్ గ్రూప్.. టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్‌వేర్, ఇంజినీరింగ్, నైపుణ్య మానవ వనరుల (స్కిల్డ్ వర్కర్)రంగాల్లో అంతర్జాతీయ నియామకాలు చేపడుతుంది.
రాజ్ గ్రూప్.. జపాన్‌లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ త్సుకయి కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గతంలో టామ్‌కామ్‌తో కలిసి పనిచేసింది. కొత్త ఒప్పందంతో హెల్త్‌కేర్ రంగంతోపాటు ఇతర రంగాల్లోనూ తన సహకారాన్ని విస్తరించనుంది. ఈ రెండు సంస్థలు రాబోయే ఒకటి రెండేళ్లలో సుమారు 500 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. హెల్త్‌కేర్, నర్సింగ్ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజినీరింగ్ విభాగం (ఆటోమోటివ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో 100, హాస్పిటాలిటీ రంగంలో 100, నిర్మాణ రంగం(సివిల్ ఇంజినీరింగ్, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామగ్రి నిర్వహణ, ఇతర నిర్వహణ)లో 100 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. యువతకు నైపుణ్యాల శిక్షణతోపాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు ఈ ఒప్పందాలు అద్దం పట్టాయని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తెలంగాణ అభివృద్ధికి సహకరించండి..
‘‘తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌లో ఉన్న తెలంగాణ వాసులకు పిలుపునిచ్చారు. శనివారం జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని అన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామని, డ్రై పోర్టును కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్‌ను పరిశీలించానని, తెలంగాణ ప్రభుత్వం కూడా మూసీ నదిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిందని, కానీ.. అందుకు కొంతమంది అడ్డుపడుతున్నారని అన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి నెలకొందని, దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవస రం లేదా? అని ప్రశ్నించారు. అందుకే హైదరాబాద్‌లో ఉన్న మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటున్నానని చెప్పారు. కాగా ‘‘ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. మన వాళ్ల అస్థిత్వం, మన ప్రాంత సంస్కృతి స్వాగతం పలుకుతోంది. జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను’’ అంటూ సీఎం రేవంత్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News